Friday, December 25, 2015

కొలరాడో యాత్ర విశేషాలు - 5

కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం
మీరు చదవకపోతే ఇక్కడ 1, 2, 3 , 4 మొదలుపెట్టచ్చు.


నాల్గవ రోజు, మంగళవారం జూన్ 30, గన్నిసెన్
ఉదయాన్నే నిద్ర లేచి కాంప్ గ్రౌండులో ఫోటోలు తీసుకున్నాము. స్నానాలు పూర్తి చేసి కాబిన్లు ఖాళీ చేసి సామాను బైకుల మీద సర్దడం జరిగిపోయాయి. మా ఈ ప్రయాణంలో బస చాలా వరకు KOA (Kampgrounds of America) లోనే చేసాము. అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. కాలకృత్యాలకు చక్కని రూములు, స్నానానికి వేడి నీళ్ళు 24 గంటలూ ఉండేవి."అలమోసా నుండి ప్రతి రోజు అంతకు ముందు రోజు కంటే అద్భుతంగా ఉంటుంది" అని వినయ్ అంటే నాకు నమ్మకం కలగలేదు. 

గన్నిసెన్ కొండలు చూసాక నిజంగానే ఓహో అనుకున్నాము. తర్వాత రోజుల్లో మిగతా ప్రదేశాలను చూసినపుడు ఆహా అనుకున్నాము. మొదటి రోజు మాత్రమే ఎక్కువ సేపు ప్రయాణం చేసాము. తరువాత అంతా ప్రకృతిని చూడడానికి ఎక్కువ సమయం కేటాయించాము. గన్నిసెన్ నుండి క్రెస్టెడ్ బుట్ లోయ ఎక్కువ దూరంలో లేదు. మెక్ డోనాల్డ్సులో కాఫీ, టిఫిన్ ముగించి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులో టాంకు నింపేసాము. 

ప్రతి రోజు ఉదయాన్నే ఇదే మా మొదటి పని. మా టాంకు, బైకు టాంకు నింపుకోవడం తర్వాత ఊరి మీద పడడం. మా గ్రూపులో ముప్పై మంది దాకా ఉన్నారు, కానీ ఎక్కువ దూరం ప్రయాణించేవాళ్ళు తక్కువ. దూర ప్రయాణం చెయ్యాలంటే బైకు టాంకు కెపాసిటీ ఎక్కువ ఉండాలి. కనీసం అయిదు గాలన్లు. చిన్న బైకులకి టాంక్ మూడు లేక నాలుగు మధ్యలో ఉంటుంది. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ప్రతి వంద మైళ్ళకి ఆగాల్సి ఉంటుంది. మా బైకులందరవీ రెండు వందల మైళ్ళు ఆగకుండా ప్రయాణం చెయ్యగలవు. 

నిన్న అనుకున్న విధంగానే ఫరూఖ్, కేకే వేరే దారిలో వెళ్ళారు. నేను, వినయ్, దేవేందర్ మరియు కృష్ణ కలిసి క్రెస్టెడ్ బుట్ లోయకి బయలుదేరాము. ఫరూఖ్ మాతో ఉన్నపుడు అతను ముందు వెళ్ళేవాడు. ఇపుడు వినయ్ ముందు వెళ్తూ ఉన్నాడు, చివరలో దేవేందర్ వస్తూ ఉన్నాడు. 

గుంపుగా వెళ్ళేటపుడు చాలా క్రమశిక్షణ అవసరం. ముందు వెళ్ళే అతనికి దారి మీద బాగా అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు మాప్ చూస్తూ వెళ్తూ ఉండాలి. వెనక వచ్చే అతని మీద వేరే భాద్యత ఉంటుంది. అది ఏమిటంటే తన ముందు ఉన్న వారందరూ సరిగ్గా వెళ్తున్నారా అని చూసుకోవడం, ఎవరి కైనా ఇబ్బంది వస్తే ఆ విషయాన్ని ముందు వారికి తెలపడం ఇలాంటివి.  

రెండు సంవత్సరాల ముందు వరకు మేము గూగుల్ మాప్స్ వాడేవాళ్ళం. బిగ్ బెండ్ వెళ్ళినపుడు కో పైలట్ అన్న ఆప్ వాడాము. ఇది ట్రక్ నడిపేవారు వాడుతూ ఉంటారు. దీనికి wi-fi లేకపోయినా పని చేస్తుంది. మాప్స్ అన్ని సెల్ ఫోనులోకి దిగుమతి చేసుకోవచ్చు. దట్టమైన కారడవిలో కూడా మాప్ చూపిస్తూ ఉంటుంది, గూగుల్ మాప్ సిగ్నల్ లేకపోతే వెతుక్కుంటూ ఉంటుంది.

వినయ్ దారిలో మంచి దృశ్యం కనిపిస్తే ఫోటోల కోసం ఆపేవాడు. 

దేవేందర్ "ఇక్కడ ఆగడం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి" అని చెప్పేవాడు. 

గుంపుగా వెళ్ళినపుడు సర్దుకు పోతూ ఉండాలి. అందుకే నేను ఒక్కడినే వెళ్ళడానికి ఇష్టపడుతాను అని కే.ఎల్.ఆర్ బైకరు మాకు క్లేటనులో చెప్పాడు. గుంపులో వెళ్తే లాభాలు కూడా ఉన్నాయి. అందరినీ నొప్పించక, మనం ఇబ్బంది పడకుండా వెళ్ళాలి.

గంట పైగా ప్రయాణం చేసి ఉంటామేమో, క్రెస్టెడ్ బుట్ లోయ వచ్చేసింది. యాత్రికుల స్థలంలో బైకులు పార్క్ చేసి ఆ చిన్న ఊరు మీద పడ్డాము. ఒక చోట డ్రాగన్, దానిని ఎదుర్కొంటున్న ఒక సైనికుడి బొమ్మలు తళ, తళ మెరిసే స్టీలుతో చేసారు. అందరం అక్కడకి వెళ్ళి కాసేపు ఫోటోలు దిగాము. అక్కడే ఉన్న గడ్డిలో కూర్చుని దారిన పోయే కార్లని చూస్తూ ఉన్నాము. పిల్లలు పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళి కాసేపు ఆడుకున్నారు. మాకు బాగా దాహం వేస్తుండడంతో పక్కనే ఉన్న షాపుకి వెళ్ళి నీళ్ళు తాగి మళ్ళీ యాత్రికుల స్థలం దగ్గరకి వచ్చి అక్కడ పని చేసే ఆమెని ఆ ఊరి గురించి అడిగాము. ఆమె ఇక్కడకి దగ్గరలోనే ఒక మంచి ప్రదేశం ఉంది, అక్కడకి వెళ్ళండి అని మాకు చెప్పింది. అక్కడ ఉన్న క్రెస్టెడ్ బుట్ లోయ స్టికర్ తీసుకున్నాము. వీటిని బైకు కి అంటించుకుంటే మనం అక్కడకి వెళ్ళామని మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఇలా ఎన్ని స్టికర్స్ ఉంటే మనం అన్ని ప్రదేశాలు తిరిగినట్టు. చిన్నపుడు మన దగ్గర ఎన్ని గోళీలు ఉంటే మనం అన్ని ఆటలు గెలిచాము అన్నట్లు.

రూపి, వినయ్, నేను యాత్రికుల స్థలంలో రూప, పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మా హెల్మెట్, బైకు గేర్ అంతా త్రక్కులో పెట్టి వెళ్ళాము. ట్రక్కు తాళం ఉంటే కానీ మా సామాను బయటకి రాదు. పిల్లలు సైకిల్ రెంట్ చేసి తొక్కుకుందామని ప్లాన్ చేస్తూ ఒక షాపులో ఉన్నారు. వినయ్ వెళ్ళి తాళం తీసుకు వచ్చాడు. ఈలోపల దేవేందర్, కృష్ణ కూడా వచ్చారు. అందరం కలిసి లోయవైపు వెళ్ళాము. ఊరు నుండి లోయ ఒక పది మైళ్ళ దూరంలో ఉంటుంది. స్వతహాగా యాత్రికుల స్థలం కాబట్టి హోటల్స్ బాగా ఉన్నాయి. వీటన్నిటినీ దాటుకుని ఒక పెద్ద మలుపు తిర్గగానే పెద్ద పచ్చని లోయ. ఆ పచ్చని మొక్కల మధ్యలో పసుపు పూలతో చాలా అందంగా ఉంది. లోయ అంచుల నుండి పైకి లేస్తున్న కొండలు, వాటిపై ఇంకా కరగని మంచు! లోయ మధ్యలో ఒక పది మందికి పైగా గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నారు. ఈ సుందర లోయని చూస్తూ కాసేపు కాలం గడిపాము.


ఫోటోలు తీసుకుని ఫరూఖ్, కేకే ఎక్కడ ఉన్నారు అని విచారించాము. ఇంకాసేపట్లో మమ్మల్ని ఫలానా రెస్టారెంటులో కలవండని చెప్పి బయలుదేరాము. మేము రెస్టారెంట్ చేరుకున్న కాసేపటికి ఫరూఖ్, కేకే కుటుంబం మమ్మల్ని చేరుకున్నారు. ఈ రెస్టారెంటులో మన భారతీయ వంటకాలతో పాటూ అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. నేను కలకత్తా బౌల్ ఒకటి తీసుకున్నా.  అందరికీ భోజనం బాగా నచ్చింది. ఎండలో తిరిగి పొట్ట నిండా తినేసరికి నాకు నిద్ర ముంచుకు వచ్చింది. వేడిగా కాఫీ పట్రమ్మని అక్కడ పనిచేసేవారిని పురమాయించాను. ఆరోజుటి నుండి మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెం కాఫీ కూడా పుచ్చుకోవడం అలవాటు చేసుకున్నాను. భోజనం కబుర్లలో ఫారుక్, కేకే ఆఫ్ రోడ్ ముచ్చట్లు చెప్పారు. వాళ్ళు వెళ్ళే దారిలో రోడ్డుకి అడ్డంగా ఆవులు వచ్చాయన్నారు. వాళ్ళు కొండపైకెక్కి మంచుని పట్టుకున్నామని చెప్పారు. వాళ్ళు తీసుకున్న వీడియోలు, ఫోటోలు మాకు చూపించారు.భోజనం అయ్యాక అందరం తిరిగి గన్నిసెన్ వెళ్ళాము. 

"ఆఫీసులో పని ఉంది" అని ఫరూఖ్ లోపలకి వెళ్ళాడు. 

ఒక గంటసేపయ్యాక బయటకు వచ్చాడు. ఈలోపల మేము ఎండలో, కాసేపు నీడలో పడుకుంటూ, తిరుగుతూ అక్కడ ఉన్న గాడిదలని ఫోటోలు తీసుకుంటూ గడిపాము. అంత సేపు ఏమయింది అని ఎవరూ అడగలేదు. ఫరూఖ్ పక్క రోజు చెప్తే కానీ మాకు తెలిసి రాలేదు. ఎండలో చమట పట్టిందని ఫరూఖ్ స్నానం చేసి వచ్చాడట. 

అది విని దేవందర్ "నేను చెప్పాను కదా" అని వాళ్ళ ఆవిడ వైపు చూసాడు. 

అక్కడ నుండి మళ్ళీ లేక్ చుటూ తిరిగి ఆరే వైపు వెళ్ళాము. మంచి ఎండ, కొండ ప్రాంతం కాబట్టి తీవ్రత కొంచెం తక్కువగానే ఉంది. గన్నిసెన్ నుండి కొండ దిగి రావాలి. చిన్న మలుపులు ఏమీ లేవు, అన్నీ పెద్ద మలుపులే! అందరూ రోడ్ ని బాగా అనుభవిస్తూ వేగంగా వెళ్తున్నారు. మధ్య, మధ్యలో కార్లని తప్పిస్తూ మా వాళ్ళని చేరుకుంటూ డ్రైవ్ ని బాగా అనుభవించాము. 

మధ్యలో బోట్ ఎక్కే ప్రదేశంలో అందరూ ఆగి ఫోటోలు తీసుకున్నాము. కొండలన్నీ దిగేసి మోంట్ రోస్ అన్న ప్రదేశంలో పెట్రోల్ కోసం ఆగాము. కాసేపు అక్కడే నీళ్ళు తాగుతూ ఒక అరగంట గడిపాము. అక్కడ నుండి ఆరే ఎక్కువ దూరంలో లేదు. ఇంకో గంటలో ఆరేలో మేము బస చెయ్యబోయే కాబిన్ చేరుకుంటాము. రోజులో చివర మజిలీ చేరుకుంటున్నామన్నపుడు కొంచెం విరామంగా వెళ్ళేవాళ్ళం. అనుకున్న ప్రకారం వచ్చేసాము కాబట్టి ప్రశాంతంగా మజిలీ చేరుకునేవాళ్ళం.  
మోంట్ రోస్ నుండి సాదా రోడ్, మలుపులు లేక అందరూ వేగంగానే బండిని నడిపారు. మళ్ళీ కొండ ప్రాంతం మొదలయింది. ఒక్కసారిగా ఎండ నుండి కొండల నీడలోకి వచ్చేసాము. రెండు వైపులా కొండలు "ఆరే కి స్వాగతం" అన్న బోర్డ్ కనిపించింది. ఇదేదో భలే ఉందే అని ఆశ్చరంలో నుండి తేరుకోకుండానే మా బస చేరుకున్నాం. ఈ ఊరంతా ఆ రెండు కొండల నడుమ ఉంటుందని వినయ్ చెప్తే తెలిసింది. 2004 లో వినయ్ కుటుంబం ఇక్కడ ఒక పది రోజులు గడిపారట. అప్పటి హోటల్ యజమాన్యం మారిపోయింది. ఇక్కడ మామూలు రూములతో పాటు ఒక ఎనిమిది కాబిన్లు ఉన్నాయి. 

మళ్ళీ ఇక్కడ కూడా నేను, ఫరూఖ్ ఒక కాబిన్ తీసుకున్నాము. దేవేందర్,కృష్ణ హోటెల్ తీసుకున్నారు. కాబిన్ల వెనక పెద్ద వాగు హోరుమనే శబ్దంతో పారుతూ ఉంది. మేము అలమోసాలో ఉన్నపుడు ఈరోజు గురించి మాట్లాడుకున్నాము. మా ప్రయాణంలో ఒక రోజు శలవు ఉంది. ఆరోజు ప్రయాణం ఏమీ లేకుండా అప్పటివరకు ఉన్న బడలిక తగ్గించుకోవడానికి ఒక రోజు అవసరమని భావించాము. మాకు మొదటిరోజు మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపించింది, తరువాత నుండి ఎక్కువ దూరం లేకపోవడం, ఇక ఎండ కూడ కొంచెం తక్కువే ఉండడం వలన పెద్దగా అలిసిపోలేదు. అలమోసా నుండి బయలుదేరేటపుడు ఆరేలో రెండు రోజులు ఉందామనుకున్నాము. 

ఆరోజు వినయ్, కేకే, విహాన్ పుట్టిన రోజు. ఒకే రోజు తొమ్మిది మందిలో ముగ్గురి పుట్టిన రోజు కాకతాళీయమే! ఆసాయంత్రం అక్కడే ఉండాలనీ, పక్క రోజు కూడా గడపాలని అందరం గన్నిసన్ వెళ్ళేటపుడు కాబిన్లు ఒక రోజు పెంచుకున్నాము. మామూలుగా అయితే ఆరే లో ఒక రోజు, పక్క రోజు డ్యూరాంగో అనుకున్నాము.
అందరం స్నానాలు చేసి బట్టలు మార్చుకుని వచ్చారు. అక్కడ నుండి రెస్టారెంట్ దగ్గరే అని నడవడానికి సిద్ధపడ్డాము. ఊరంతా ఒక రోడ్ మీదనే ఉంది, కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు అంతే! బాగా చిన్న ఊరు. ఈ ఊరిని "అమెరికా స్విడ్జర్లాండ్" అని పేరు కూడా ఉంది. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంది. ఒక ఐరిష్ రెస్టారెంట్ చేరుకున్నాము, లోపల కంటే బయట కూర్చోడానికి బాగుంది. తొమ్మిది మంది బయట కూర్చున్నాము. మంచి విందు తర్వాత కేక్ తీసుకువచ్చి రెస్టారెంటులోని వారు ఒక పుట్టిన రోజు పాట పాడారు. ముగ్గురు కేక్ కట్ చేసాక చిన్నవాడైన విహాన్ కి అమ్మా, నాన్న బహుమతులు ఇచ్చారు. 

ఫరూఖ్ పక్క రోజు మాతో రాకుండా ఉదయం లేటుగా లేచి బట్టలు ఉతుక్కుని మధ్యాహ్నం అతని బంధువు ఉన్న మేసా వర్డే ఊరికి వెళ్తానన్నాడు. 

"రాత్రి డ్యూరాంగోలో ఉంటాను, మీరు రెండో రోజు మధ్యాహ్నం నన్ను అక్కడ కలవచ్చు" అని చెప్పాడు. 

మేము దిగిన హోటలులో లాండ్రీ సౌకర్యం ఉంది. అప్పటికే నాలుగు రోజులు దాటాయి కదా, మాసిన బట్టలు ఉతుక్కునే అవకాశం కలిగింది. ఆ హోటలు వారు జీప్ రెంటుకి ఇస్తారు. నాకు జీప్ అంటే ప్రాణం. అది రెంట్ చేసి అక్కడ ఉన్న కొండలు తిరగచ్చు. మొదట అది చేద్దామనుకున్నా. కానీ వినయ్ పక్క రోజు మిలియన్ డాలర్ హైవే వెళ్ళి తిరిగి ఆరే వద్దాం అన్నాడు. రెండో రోజు కూడా మిలియన్ డాలర్ హైవే వెళ్ళి డ్యూరాంగో చేరుకుంటాము. మిలియన్ డాలర్ హైవే అంటే బైకర్లకి అరుదైన అవకాశం. మళ్ళీ ఇక్కడకి బైకులో రావడం కష్టం, కాబట్టి నేను, వినయ్, రూపి, దేవేందర్, కృష్ణ మిలియన్ డాలర్ హైవే వెళ్దామని నిర్ణయించాము. కేకే తన ట్రక్కులో పిల్లలతో ఆఫ్ రోడ్ వెళ్తానన్నాడు, పక్కరోజు మాతో మిలియన్ డాలర్ హైవే వస్తానన్నాడు. అప్పటికే ఆలస్యమయ్యేసరికి అందరం నడిచి కాబిన్ చేరుకుని పడుకున్నాము.

No comments: