Wednesday, September 3, 2008

నా నయాగరా పర్యటన - 1


చాలా చోట్ల లేబర్ డే మే 1న చేసుకుంటారు. అమెరికాలో మాత్రం సెప్టెంబరు 1న లేబర్ డే జరుగుతుంది, కొంచెం చరిత్ర తెలుసుకుంటాను అంటే ఇక్కడ నొక్కండి.


శని,ఆదివారలు ఎలాగూ సెలవు,ఇక సోమవారం కుడా సెలవ్ అని తెలిసిన తర్వాత కుదురుగా కూర్చుంటామా?నయాగరా చూసొద్దామని తీర్మానించి దానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాను.3 రోజులు ఎలాగూ సెలవు, ఇంకొక రోజు కుడా సెలవు తీసుకుని 4 రోజులు మా కుటుంబానికి బస ఏర్పాట్లు చేసేసాం.నయాగరా జలపాతానికి ఒక మైలు దూరంలో బస దొరకడం విశేషం!


మా ఊరు నుండి నయాగరాకి వెళ్ళాలంటే రెండు మార్గాలున్నాయి.మొదటిది, సులభమయినది కెనడా వైపు వెళ్ళడం.ఇలా అయితే 270 మైళ్ళు.రెండవ మార్గం లేక్ ఏరీ కింద నుండి వెళ్ళడం.ఇలా అయితే క్లీవ్ లాండ్ మీదుగా 390 మైళ్ళు వెళ్ళాలి. అంటే ఇంచుమించు 6, 7 గంటల ప్రయాణమనమాట. ఉరామరిగ్గా (అంటే ఇంచుమించు,ఈ పదాన్ని చిత్తూరు జిల్లాలో తరచూ వాడుతుంటారు) హైదరాబాదు నుండి చెన్నై అంత దూరం అనుకోండి! కెనడా వైపు వెళ్ళాలంటే అందరికీ కెనడా విసిటర్ వీసా ఉండాలి,మాకందరికీ ఆ సౌకర్యం లేకపోయేసరికి తప్పనిసరై క్లీవ్ లాండ్ మీదుగా వెళ్దామని సర్దుకున్నాం. నయాగరా వెళ్ళాలంటే మిచిగన్ నుండి ఒహాయో,పెన్సిల్వేనియా రాస్ట్రాలు దాటి న్యూయార్క్ రాస్త్రం లోకి ఎంటరవ్వాలి.


4 రోజులు తినడానికి కొన్ని రొట్టెలు, టర్కీ మీట్, కొంచెం లాట్టుస్ ఆకులు కొనుక్కున్నాం.మా అమ్మ శాఖాహారి కాబట్టి కొన్ని "రెడీ టు ఈట్" పాకెట్లు కొన్నుక్కున్నాం.ఆపిల్,అరటి పండ్లు తగినన్ని కొన్నాం.మా అమ్మాయి దియా తిండి, తాగడానికి పాలు పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకా వేసవి కాలమే కాబట్టి వాటర్ బాటిళ్ళు కుడా కారులో పెట్టుకున్నాం. శనివారం ఉదయం బయలుదేరుదామని అనుకుని,ఆ రోజు దారిలో తినడానికి పులిహోర,పెరుగన్నం చేయమని మా ఆవిడకి ఆర్డరు వేసాం.శుక్రవారం రాత్రి అన్ని సామాన్లు సర్దుకుని ఉదయం టిఫిన్ తిని బయలుదేరుదామని నిద్రకి ఉపక్రమించాం.


సమయం : శనివారం ఉదయం 9 గంటలు
స్థలం : ఇంకా మా ఇల్లే!

మా అమ్మ ఉదయాన్నే అందరికంటే ముందు నిద్ర లేస్తుంది కాబట్టి,తొందరగా లేచి టిఫిన్ చేసి "మా టీవీ" చూస్తూ కూర్చుంది.మా ఆవిడ దియాకి స్నానం చేపించి,తను కుడా స్నానం చేసి రెడీ అయింది. నేను కుడా స్నానం పూర్తి చేసి పులిహోర తిని,కాఫీ తాగి కెమెరా,దానికి బాటరీలు బాగ్ లో పెట్టుకున్నా.ఇక సామాన్లన్నీ కారు డిక్కీలో సర్దేసా.ఇక కారులో సంగీతం వినడానికి ఐపాడ్,చార్జర్ తగిలించి ఇంటి నుండి బయటపడేసరికి 11:30 అయింది.ముందుగా గూగుల్ మాప్ లో నుండి తీసుకున్న "డ్రైవింగ్ డైరక్షన్" కాగితాలు పక్క సీట్లో కూర్చున్న మా ఆవిడ చెపుతూ ఉండగా నేను కారు తోలుతూ బయలుదేరాం.వెనక సీట్ లో మా అమ్మ,కారు సీట్ లో దియా దారిలో రోడ్డు,పక్కన పోతున్న వాహనాలు చూస్తూ కూర్చున్నారు.

సమయం : శనివారం మధ్యాహ్నం 3 గంటలు
స్థలం : లేక్ ఏరీ దాటినట్టున్నాం.

రెస్ట్ ఏరియా కి కొంచెం ముందే "లేక్ ఏరీ" కనిపించింది.ఇది సముద్రమా" అన్నట్టున్నటువంటి దాని ఆకారం చూసి చాలా ఆశ్చర్యమేసింది.లేక్ ఏరీ గురించి కొన్ని కబుర్లు కావాలంటే ఇక్కడ నొక్కండి. ఉదయం తిన్న పులిహోర అరిగిపోయి,దారిలో తిన్న చిరు తిండి కరిగి పోయి పొట్టలో ఎలుకలు "కబడి..కబడి" అనకముందే కారు "రెస్ట్ ఏరియా" లో ఆపాం.అందరూ కాసేపు ఫ్రెష్ అయ్యి చెట్ల కింద పెరుగన్నం తిని కాసేపు సేద తీర్చుకున్నాం. మాలాగే 2 కుటుంబాలు చెట్టు కింద కూర్చుని అన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఇక్కడ నుండి మాకు ఇంకొక 2, 3 గంటల ప్రయాణం. మధ్య,మధ్య రోడ్లకి "టోలు" కడుతూ 4గంటల సమయలో నయాగరా పొలిమేరల్లోకి ప్రవేశించాం. నయాగరా జలపాతం ఉన్న ఊరు పేరు "బఫలో" అనమాట.బఫలో చేరి హోటలు సులభంగానే కనుక్కున్నాం.
కారు నుండి సామానంతా దించి హోటలు రూము ఒకసారి అంతా పరిశీలించి కాసేపు నడుం వాల్చాం. ఒక గంట తర్వాత మా ఆవిడ పిలుపుకి లేచి తాజా టీ తాగి బయటకి షికారు బయలుదేరాం.

నయాగరా జలపాతంలో చూడవలసిన ప్రదేశాలతో ఇంకొక టపాలో రాస్తాను.

2 comments:

Raj said...

అమెరికా వైపునుండి నయాగరా యాత్రా విశేషాలు వ్రాస్తున్నారన్నమాట. మీ తరువాతి టపా కోసం ఎదురు చూస్తుంటాను.

శ్రీ said...

రెండవ టపా కుడా దీని పైన ఉంది చూడండి.