Friday, January 9, 2009

రాజు వెడలే జైలుకూ ?


సత్యం మాజీ చైర్మన్ రామలింగ రాజు గారు ఇపుడే కొన్ని గంటల ముందు డీ.జీ.పీ ముందు లొంగిపోయారు. హైదరాబాదుకి ఎంతో పేరు తీసుకు వచ్చిన రామలింగరాజు 7000 కోట్ల రూపాయల కుంభకోణానికి కారకుడు కావడం మనకెంతో విచారకరం. దేశంలో 4 వ స్థానంలో ఉన్న ఐ.టీ కంపెనీకి ఈ దుర్గతి పట్టడం మన దురదృష్టం.


డిసెంబరులో మేటాస్ గ్రూపు కంపెనీలని విలీనం చేయాలని రామలింగ రాజు ప్రతిపాదించడం, బోర్డు డైరక్టర్లు దానికి వ్యతిరేకించడంతో సత్యం లో ఏవో లుకలుకలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. 1987 లో ఈ సత్యం కంప్యూటర్స్ మొదలయింది. అలా మొదలయిన కంపెనీ 2000 తర్వాత మంచి విజయాలు సాధించి ఎక్కువ కస్టమర్లని ఆకర్షించి లాభాల బాటలో సాగింది. ఈ కంపెనీకి ఇపుడు 67 దేశాల్లో 54000 వేల పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన పెద్ద సంస్థ ఎందరో యువతీ, యువకులకు ఉపాధి కల్పించి హైదరాబాదు సిటీకే మంచి పేరు తీసుకువచ్చింది. రామలింగ రాజు ఈ మధ్య కాలంలో ప్రజలకి కుడా అంబులన్స్ సర్వీసు ద్వారా చేరువయ్యారు. ప్రజలందరిలో ఇటువంటి మంచి పేరున్న రామలింగ రాజు ఇలా ఎందుకు చేయవలసి వచ్చిందో సీ.బీ.ఐ దర్యాప్తు లో బయటపడవచ్చు.


రామలింగ రాజు తన సంస్థకి ఎక్కువ లాభాలని చూపించడానికి చాలా కారణాలుండవచ్చు.


1) మా సంస్థలో ఎదుగుదల బాగా ఉంది,లాభాలు రెట్టింపయ్యాయి అంటే అందరి దృష్టి దాని మీద పడచ్చు. తద్వారా ఎక్కువ ముదుపరులు తమ స్టాకు కొండానికి అవకాశం ఉంది.


2) "మా కంపెనీ టర్నోవర్ ఇంత ఉంది, మా లాభాల వల్ల రాష్ట్రానికి చాలా టాక్సులు కడుతున్నాం, అందుకని మీరు మాకు పన్నుల్లో మినహాయంపు ఇవ్వండి" అని ప్రభుత్వం దగ్గర రాయితీలు పొందచ్చు. అలాగే చేసి రాయితీలు పొందుతున్నారు కుడా.


3) కంపెనీని ఇలా పెద్దదిగా చూపించడం వల్ల కస్టమర్లు పెరుగుతారు. ప్రపంచ బాంకు, ఆటోమొబైల్ రంగం, వైద్య, ఇన్స్యూరన్స్ రంగాల్లో అలాగే సత్యం కంప్యూటర్స్ కి అవకాశాలు, లావాదేవీలు పెరిగాయి.


4) చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి మేటాస్ లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఏ అనుభవం లేకుండానే ఈ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులిచ్చి ప్రభుత్వం బ్రహ్మరధం పట్టింది. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పనులు కుడా ఈ మేటాస్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పెద్ద బోగస్ అని ఢిల్లీ మెట్రో రైలు రూపకర్త శ్రీధరన్ క్రితం సంవత్సరం కొన్ని సంచలన ప్రకటనలు చేసాడు. అది చివరకు నిజమయినట్టుగా అనిపిస్తుంది.


5) చివరకు ప్రజలకి సహాయం చేసే ఆంబులన్స్ విషయంలో కుడా గోల్ మాల్ జరిగిందని పత్రికలు గొగ్గోలు పెడుతున్నాయి. అయిన ఖర్చు కంటే ఎక్కువ పెట్టి వాహనాలని కొనుగోలు చేసారని అభియోగం.


బాంకులో ఉన్న డబ్బులు కంటే ఎక్కువ ఉన్నాయంటే ఆ విషయం ఒక చైర్మెన్ కే కాదు, కంపెనీ బాంకు వ్యవహారాలు చూసే మామూలు గుమస్తాకి తెలియదా? కంపెనీలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే బాంకులో ఎంతున్నాయి అన్న విషయం మొత్తం కంపెనీ ఆర్ధిక శాఖకు తెలియకుండా ఉండదు. ఆడిటింగ్ వ్యవహారాలు చూసే సంస్థ అయినా ఈ విషయాన్ని ఎందుకు వెలుగులోకి తీసుకు రాలేదు? కొన్ని సంవత్సరాల క్రితం ఎన్రాన్ కుడా ఇలాగే అకౌంట్లని తారుమారు చేసింది. అమెరికా ప్రభుత్వం ఇటువంటివి మళ్ళీ జరక్కుండా "SOX" అని అన్ని కంపెనీలకి కొత్త నియమాలని పెట్టింది. మన ప్రభుత్వం కుడా "BOX" అని ఏమన్నా కొత్త నియమాలని తెస్తుందేమో? ఉద్యోగులందరికీ డిసెంబరు నెల జీతాలు చెల్లించగలిగాం! అని కంపెనీ కొత్త సీ.ఈ.వో రాం మైనంపాటి చెప్పారు. 54000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఇపుడు గాల్లో ఊగుతుంది.


ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్పోరేట్ చట్టాలని పటిష్టం చెయ్యాలి. అకౌంటు పుస్తకాల తనిఖీలు చేస్తూ ఉండాలి, అపుడే ఇటువంటి ఘరానా మోసాలకి కళ్ళెం వెయ్యచ్చు. ఏది ఏమయినా ఈ కుంభకోణం మీద సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటకు తీయాలి. ఇందులో ప్రభుత్వ అవినీతిని కుడా ఎండగట్టిన నాడే తెలుగు జాతి గర్వపడుతుంది.


10 comments:

Unknown said...

రాజు జైలు కి వెల్లటము జరిగేపని కాదు.పోలీసుల అండతో(వాళ్ళ బాస్ ల అండతో...)సెబి దర్యాప్తు నుండి తప్పించుకోవటానికి వేసిన ఇంకొక నాటకం.తర్వాత గుండెనెప్పి,ఇంకా మాయదారి రోగాలు చాలా వస్తాయి, ఇడుపులపాయలో అథిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.సత్యం నుండి దారి మళ్ళించిన 7000 కోట్లకి ఇదే 'సాక్షీ.
-నేనుసైతం

Anonymous said...

టైటిల్ చూసి బాగా నవ్వొచ్చింది. అవును, ఆయన జైలు కు వెళ్ళడం జరిగే పని కాదు. ఇంతకు ముందూ చూశాం, వేల కోట్లు మింగి నిక్షేపంగా తిరుగుతున్న వాళ్ళను. వీళ్ళ నిర్వాకం వల్ల దెబ్బ తినేది, సంస్థ ఉద్యోగులు, పరోక్షంగా, దేశం పేరు చెడగొట్టబడి, తద్వారా వచ్చే ప్రాజెక్ట్లు రాక, దానితో ఉద్యోగవకాశాలు కోల్పోయే యువత, ఇతర సంస్థల ఉద్యోగులు వగైరా.

తిన్నది, తిననివ్వనిచ్చి, విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎలానో విషయాలను కప్పి ఉంచితే, కనీసం ఇతరులైనా బాగుపడి ఉండేవాళ్ళేమో.

చైతన్య.ఎస్ said...

కాని శ్రీ గారు తెరవెనుక కథలు బయటకు రావు అనుకుంటా ! అన్నీ 'పెద్ద' తలకాయలే కదా !

శ్రీ said...

ఇపుడే వార్తల్లో రామలింగ రాజుకి చాతీలో నొప్పి వచ్చిందని రాసారు.

మీరందరూ అన్నట్టు ఈ నిజాలు బయటకి రావడం కష్టమే!

ఇంకొక టైటిల్ కుడా అనుకున్నాను రవి గారూ,అది సత్యం! భళారే అసత్యం!! కాకపొతే జైలుకి వెళ్ళడం పగిలిపోయే(breaking) వార్త కాబట్టి అది పెట్టా.

Unknown said...

నిక్కము వచించితిరి నేను సైతం గారు.
-గడ్డిపువ్వు

శ్రీ said...

ఇపుడే ఈనాడు వార్తలు చూస్తే "రాజు వెడలే జైలుకు" అని వార్త ఉంది. ఈనాడు కి కుడా నాకు వెలిగిన బల్బే వెలగడం విశేషం!

సుజాత వేల్పూరి said...

Sree gaaru,
let's book Ramoji rao under copy rights act....for using your title!ha ha !

శ్రీ said...

ఎందుకులెండి సుజాత గారు. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టవుతుంది! --)

Anonymous said...

ఈనాడులో మొదటి పేజీ చూడగానే మీరు గుర్తొచ్చారు...

శ్రీ said...

--)