Wednesday, January 14, 2009

మస్కా - కొంచెం కష్టం కొంచెం ఇష్టం



ముందుగా తెలుగు ప్రజలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. బ్లాగర్లందరూ చక్కగా సంక్రాంతి పండుగని జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.



నిన్న మా ఊర్లో మస్కా ప్రీమియర్ జరిగింది. మొదటి రోజు సినిమాకి ఎవరు రాకపోయినా "ఆ నలుగురు" తప్పకుండా వస్తారని మా ఊరి థియేటర్ యాజమాన్యం, ఎగ్జిబిటర్ల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా వంతు కృషి చేస్తూ ఉంటా నలుగురిలో ఒకడయిన నేను!




సినిమా మొదట సగం చూస్తూ ఉంటే ఇది బీ గోపాల్ సినిమా యేనా అని నన్ను నేను చాలా సార్లు ప్రశ్నించుకున్నాను. బీ గోపాల్ కి ఎమ్మెస్ రాజు బాగా సహాయం అందించి ఉండచ్చని నేను అనుకుంటున్నాను. అపుడపుడూ ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్ కనబడుతూ ఉండేసరికి ఆ అనుమానం కొంచెం బలహీనపడుతూ వచ్చింది. విరామం దగ్గరకి వచ్చేసరికి స్కార్పియోలు గాలిలొకి ఎగిరాక నా అనుమానం హారతి కర్పూరం లాగ గాల్లో కలిసిపోయింది. తర్వాత నుండి మన నమ్మకాన్ని వమ్ము చేయని మామూలు బీ గోపాల్ సినిమానే.




హీరో రాం డాన్సులు తమాషాగా ఉన్నాయి! అటు ఇటు వంకరలు తిరిగి కుడివైపు గానీ,ఎడమ వైపు కానీ గాల్లోకి ఎగురుతాడు. పాటతో సంబంధం లేకుండా ఇవే స్టెప్పులు రిపీట్ చేస్తూ ఉంటాడు. రెడీతో కొంచెం పాపులర్ అయ్యాడు తప్పితే ఇతనిలో విషయం తక్కువ. ఈ సినిమాలో రాం పాత్ర "సోంబేరికి సింబల్ లా ఎదవకి ఎంబ్లం లా" ఉంటుంది. ఈ డైలాగ్ అతనే చెప్పుకుంటాండు ఒక సన్నివేశంలో. సినిమాలో సునీల్ ఎక్కువసేపు ఉంటాడు. అందువల్ల మొదట మనకి నవ్వు రాకపోయినా అలవాటయ్యాక బాగనే నవ్వుతాము. బ్రమ్హానందం కాసేపే ఉంటాడు, అతని మొదటి సన్నివేశం తప్పితే మిగతావి రొటీన్ సన్నివేశాలే!






ఇంతకు ముందు పరుగులో నటించిన షీలా ఈ సినిమాలో కొంచెం పొగరుగా,వగరుగా నటించింది. ఈ పాత్ర పైటా,పావడతో బాగా ఉండేది పొగరులో. ఈ సినిమాలో మోడరన్ (అందాల ఆరబోత) గెటప్ ఈమెకి నప్పలెదు. చెన్నయ్ కి రిటన్ టికెట్ కొనుక్కోమని నా ఉచిత సలహా.





హన్సిక దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర రంగంలొకి ఆరంగేట్రం చేసింది. బొద్దుగా ఉన్నఆమె శరీరమే ఈమెకి పెట్టుబడులు, తప్పితే నటన శూన్యం. విపరీతమయిన డైటింగ్ చేసినట్టుంది, సత్యం కంప్యూటర్స్ లో ముదుపరులకి జరిగినట్టు ఈమె పెట్టుబడి కూడా హుష్ కాకి అయింది. ఈమె కుడా ముంబాయి కి వెళ్ళిపోవడం మేలు, లేదంటే "చందన బ్రదర్స్" ఆడ్ మీద వచ్చే రాయల్టీతో బతుకు సాగించవచ్చు.




ఇటువంటి సినిమాల్లో పాటలు బాగుండాలి. బీ గోపాల్ స్కూలు సిలబస్ లో పాటలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. బాక్ గ్రౌండు సంగీతం తప్పితే పాటల్లో కొత్తదనం లేదు. కింగ్ సినిమాలో చక్రి మీద వేసిన సెటైరు నిజమేననిపిస్తుంది ఈ పాటలు వింటే! ఝాన్సీ నెల్లూరు భాష కొంతవరకు పరవాలేదు, కొన్ని గాప్స్ కవర్ అయి ఉంటే ఇంకా బాగుండేది. నరేష్ పాత్ర పరవాలేదు. సీత పాత్ర మీద శీతకన్ను వేసారు.




సినిమా చివరలో ఉండగా ఎగ్జిబిటర్ కాల్ చేసాడు నలుగురిలో ఒకరికి. మా వాడు "ఆ పరవాలేదు, అవరేజ్ సినిమా. రేపు ఐడిల్ బ్రైను మూడో, మూడుంకాలో వేస్తాడు" అన్నాడు.




కొసమెరుపు: సూమెలు, స్కార్పియోలు గాల్లోకి ఎగరడం చాలా కామన్ అయిపోయింది తెలుగు సినిమాల్లో. ఈ సినిమాలో కూడా ఒక సన్నివేశంలో రాం, హన్సిక ఒక కూడలిలో ఉంటారు. నాలుగు వైపులా నాలుగు స్కార్పియోలు ఉంటాయి. ఈ నాలుగు స్కార్పియోలు వీళ్ళని ఢీ కొట్టే సమయంలో రాం వాటి మీద ఖాళీ డబ్బాలని దొర్లిస్తాడు. అంతే, నాలుగు స్కార్పియోలు గాల్లోకి లేసి ఒకదానికొకటి గుద్దుకుంటాయి. మా నలుగురిలో ఒకతను తట్టుకోలేక "నీ యమ్మ...ఇది నిజంగా పరాకాష్ట బాసూ" అని గావుకేక పెట్టాడు!






చివరగా ఇంకొక విషయం. ఇప్పటివరకు తోటి బ్లాగర్ల దృష్టిలో నాకు అవరేజ్ గా అనిపించిన సినిమాలు డిసాస్టర్ గా నమోదు చేయబడ్డాయి.

16 comments:

రానారె said...

:-))))))))) @ సినిమాలో సునీల్ ఎక్కువసేపు ఉంటాడు. అందువల్ల మొదట మనకి నవ్వు రాకపోయినా అలవాటయ్యాక బాగనే నవ్వుతాము.

చివర్లో గావుకేక సంగతి కూడా బాగా నవ్వించింది. రాస్తూనే ఉండండి కాలాస్త్రి పడమ్ రివ్యూగళ్.

శ్రీ said...

తప్పకుండా రానారె గారు.

వేణూశ్రీకాంత్ said...

శ్రీ గారు, రానారె గారి మాటే నా మాట కూడా. గావు కేకకి ట్రైన్ లో నా పక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టించు కోకుండా గట్టిగా నవ్వేసాను :-)

శ్రీ said...

బాగుందండీ వేణూ శ్రీకాంత్ గారు.ట్రైనులో వెళ్తూ టపా ఎంజాయ్ చేసారనమాట.

లక్ష్మి said...

movie kante mee review adirindi :))) gavukeka bhale navvinchindi

సుజాత వేల్పూరి said...

సుమోలు పాతబడ్డట్టున్నయి ఈ మధ్య, స్కార్పియోలు ఎగురుతున్నాయి. సునీల్ కామెడీ, గావు కేక, ఐడిల్ బ్రైన్ వాడి రేటింగు,రామ్ డాన్సులు .. అమ్మో, మొత్తానికి రివ్యూ అదరగొట్టారు.

మేధ said...

>>సోంబేరికి సింబల్ లా ఎదవకి ఎంబ్లం లా
:))

శ్రీ said...

లక్ష్మి,సుజాత గారు,

మీకు రివ్యూ నచ్చినందుకు సంతోషం.

మేధ గారు,

ఆ డైలాగ్ సినిమాలోదే, రాం అంటాడు ఒకసారి.

Rajendra Devarapalli said...

బ్లాగర్లందరూ చక్కగా సంక్రాంతి పండుగని జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను---కనీసం ఒక్క నాలుగైదు వేలు పంపించి(నాకు ఒక్కడి కన్నా)పిలుపేంఖర్మ అరిచి చెప్పగలరని కోరుకుంటున్నా... న్.
బొద్దుగా ఉన్నఆమె శరీరమే ఈమెకి పెట్టుబడులు...విసిరేసినట్టు దూరంగా ఉండే మాపల్లెటూరుకే హన్సికా మోత్వాని దేశముదిరిన దగ్గర్నుంచి ఇప్పటికి ఒక అరడజను సార్లొచ్చింది.కళ్ళుతెరిచి,రెప్పలార్పుతూ,తెరుస్తూ,జుట్టుచేత్తోపట్టుకుని
హైహీల్స్ తో చలాకీగా నడవగలిగితే చాలన్న సులువైనసూత్రాలు చాలవా అని నేన్ ప్రశ్నిస్తున్నా...
బొద్దుగా ఉంటారనే మోటా వని అని ఇంటిపేరు పెట్టుకున్నారాఫ్యామిలీ

బీ గోపాల్ స్కూలు సిలబస్ లో పాటలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు.... ఇది మరొక పూర్తి నిరాధారమైన ఆరోపణ అని బల్లగుద్దుతున్నా..మామా మంచమెక్కు...మరియు చీరాసారె కొనిపిస్తా చేలోకొస్తావా?మరియు ఇలాంటిరసగుళికలు వారు మనకందించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నా?

శ్రీ said...

రాజేంద్ర గారు,

"పిలుపునందిస్తున్నాను" అని రాసేటపుడు నేను విపరీతంగా ఫీల్ అయ్యాను.

నేను పిలుపినివ్వడమేమిటి? ఏదో రాష్ట్రపతి లాగా? బ్లాగులో రాసుకుని ఇలా సరదా తీర్చుకున్నాను.

బీ గోపాల్ సినిమాకి హన్సిక క్వాలిఫికేషన్ సరిపెట్టుకోవచ్చు. ఇపుడు సన్నబడ్డాక ఇంటి పేరు మారుస్తుందా?

(ఇపుడు బల్ల గుద్దడం నా వంతు --))

మామా మంచమెక్కు..., జయమ్మ జయమ్మ..బాలయ్య బాలయ్య (లారీ డ్రైవర్) లాంటి పాటలు రస గుళికలు అనడానికి నేనొప్పుకోను. అవి సారా ఉండలు!!

(ఇపుడు గుద్దడానికి బల్ల లేదు, విరిగిపోయింది)

ఏకాంతపు దిలీప్ said...

మీ రివ్యూలన్నిటిలో ఇది సరి కొత్తగా వుంది... :-)

చైతన్య కృష్ణ పాటూరు said...

బెంగుళూరులో కుదరటం లేదు గానీ, మా ఊరులో ఉన్నప్పుడు నేను కూడా "ఆ నలుగురు"లో ఉండేవాడిని. మొత్తానికి మీ రివ్యూ భలే ఉంది. చివర్లో గావుకేక నిజంగా కేక.

రాధిక said...

ఏదన్న సినిమా రిలీజు వుందంటే మావారి టెంక్షన్ చూడాలి.ఐడిల్ బ్రెయిన్ వాడు ఏ రేటింగ్ ఇస్తాడో అని.మీ నలుగులో ఒకళ్ళ ఫోను నంబర్ ఇవ్వండి .జీవీ నాడిని బాగా పట్టేసినట్టున్నారు.బాగుంది మీ రివ్యూ

శ్రీ said...

దిలీప్ గారికి,

గతంలో "నేనింతే" సినిమా రివ్యూ లో పస లేదని రవి( బ్లాగాడిస్తా) అన్నారు. అప్పటి నుంచి ఇంకొంచెం ఓపిగ్గా రాస్తున్నానండీ. ఈ సందర్భంగా రవిగారికి కృతజ్ఞతలు.

చైతన్య కృష్ణ గారికి,

నెనర్లు.

రాధిక గారికి,

నేను సినిమా వేసేటపుడు నాకు భలే టెన్షన్ ఉండేదండీ.రాత్రి నిద్రలో లేసి రివ్యూ చూసి పడుకునేవాడిని.రివ్యూ బట్టి మన సినిమాలకి ఎంతమంది వస్తారో డిసైడ్ చెయ్యచ్చు ఈ దేశంలో. జీవి నాడిని చాలా రోజుల ముందే పట్టేసారు మా నలుగురు. జీవి నాడిని చాలా రోజుల ముందే పట్టేసారు మా నలుగురు. ఈసారి సినిమాకి ఒక హెల్ప్ లైను పెడుతాము.

మధురవాణి said...

ఆదరగోట్టేసారండీ రివ్యూ.. నవ్వులే నవ్వులు :)

శ్రీ said...

నెనర్లు మధురవాణి గారు.