Tuesday, September 1, 2009

అనుకోకుండా ఇంకో రోజు

ఉదయం నిద్ర లేస్తూనే మనకి తెలియదు ఈరోజు ఎలా ఉంటుందో అని. ప్రతి రోజు లాగే ఈరోజు కూడా ఉండాలనుకుంటాము కానీ ప్రతి రోజు మనకి కొత్తగా ఉంటుంది.కొన్ని సార్లు ఆరోజు మనకి తీపి గుర్తులు మిగల్చవచ్చు,మరి కొన్ని సార్లు చేదు జ్ఞాపకాలు కూడా మిగల్చవచ్చు.అటువంటిదే నిన్నటి రోజు.అంటే తీపి,చేదు జ్ఞాపకాలు లాంటివి ఏమీ లేదు కానీ చెప్పుకోవడానికి చాలా జరిగాయి.


లెక్క ప్రకారం నిన్న ఆఫీసుకి నా కారు తియ్యాలి,మా పూలబ్బాయికి మధ్యాహ్నం పిక్నిక్ ఉండి "నేను కారు తెస్తాను" అన్నాడు.(మీరు నా పాత బ్లాగు చదవకపోతే పూలబ్బాయి గురించి తెలియదు,ఇక్కడ చదవండి)సరేలే,నేను ఇంటికి వచ్చేటపుడు ఎవరో ఒకరితో రావచ్చు అని అతని కారులో ఎక్కా. సాయంత్రం వరకు అఫీసులో కిందా,మీదా పడి "పని పూర్తి చేసాను" అనిపించాను.


మేము ప్రతి సంవత్సరమూ ఆడే క్రికెట్ లీగుకి కొంత మంది స్పాన్సర్లు డబ్బులు ఇస్తూ ఉంటారు.ఫలానా మార్టుగేజు కంపెనీకి చెందిన ఒక స్పాన్సర్ని సాయంత్రం "మార్టుగేజు సమస్యలు" మీద చర్చకి ఆహ్వానించాము.మీటింగ్ కి వస్తే ఫ్రీ సమోసా,పెప్సీ అనగానే నేనూ రెడీ అయ్యాను. అఫీసు నుండి ఒక 5 నిముషాల్లో లొకేషన్ చేరుకున్నాం.ప్రతి 5 నిముషాలకొక సమోసా చొప్పున లాగిస్తూ కూర్చున్నాను.ఒక గంట సేపూ సాగిన చర్చలో మార్టుగేజు గురించి మంచి విషయాలే తెలిసాయి.


ఇక ఇంటికి ఎలా వెళ్ళాళా అని అలోచిస్తూఉండగా "నేను ఇంట్లో దింపుతాలే, మధ్యలో ఏర్ పోర్టుకి వెళ్ళి ఇంటికి వెళ్దాం" అన్నాడు సాయి.
చాలా రోజులయింది ఏర్ పోర్టు చూసి అనుకుని సాయి వేను ఎక్కా.


అప్పటివరకు మామూలుగానే ఉన్న సాయి వేను ఎక్కగానే విశ్వరూపం చూపించాడు. రావలసిన వాళ్ళు ఆల్రెడీ ఏర్ పోర్టులో వచ్చి వెయిట్ చేస్తున్నారన్న నిజాన్ని జీర్ణించుకోలేక తోక తొక్కిన తాచుపాములాగా బుస కొట్టాడు. మామూలుగా నేను పాసెంజరుగా కారెక్కానంటే 2 నిముషాలు చాలు నిద్రలోకి జారుకోవడానికి.అలాంటి నేను కన్ను మూస్తే కాలాస్త్రి చేరేట్టున్నానని సీట్ బెల్టు పెట్టుకుని సాయి వైపు బెదురు చూపులు చూస్తూ కూర్చున్నా. రోడ్డు మీద ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి వేనుని తాచుపాములాగా తోలుతున్నాడు. ఎలాగో ఏర్ పోర్టుకి చేరుకున్నాం.


"ఎప్పుడొచ్చావ్ కాదన్నయ్యా! బుల్లెట్టు దిగిందా, లేదా? అనేదే ముఖ్యం!" అన్న ఫీలింగుతో నా వైపు చూసి మహేష్ బాబులా నవ్వాడు.


మాకోసం అక్కడే ఎదురుచూస్తున్న ఇద్దరు అమ్మాయిలు,ఒక అబ్బాయిని పలకరించి వాళ్ళ లగేజ్ వేనులో సర్ది ఇంటికి బయలుదేరాము.కొత్తగా వచ్చిన వాళ్ళతో కొన్ని పలకరింపు కార్యక్రమాలతో ప్రయాణం ఈసారి నెమ్మదిగా జరిగింది.మాటల్లో తెలిసింది వాళ్ళు ఇక్కడ బయో ఇంఫర్మాటిక్స్ చదువుకోవడానికి వచ్చారంట.3 సెమిస్టర్లు ఉన్న కోర్సుకి ఫీజులతోనే 25 లక్షలవుతుందట!


"ముగ్గురూ కలిసి వచ్చారు? మీరంతా ఫ్రెండ్సా?" అంటే "లేదు,ఆర్కుట్ లో కలిసాం" అని విజయ గర్వంగా చెప్పింది ఒకమ్మాయి.ఇద్దరు హైదరాబాదు,ఇంకొకరు రాజస్తాన్ నుండి అట.


"ఈ రోజుల్లో ఆడపిల్లని అమెరికాకి ఒంటరిగా చదువుకోవడానికి ఇంత డబ్బిచ్చి పంపుతున్నారంటే పేరెంట్స్ ని మెచ్చుకోవచ్చు" అన్నాడు సాయి. నిజమేనని నేను తల ఊపాను. వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు మాత్రం కిటికీలో నుండి అమెరికాని చూడడంలో బిజీగా ఉన్నారు.


"వీళ్ళని ఇంట్లో దింపేసాక చిన్న పని ఉంది,అది చూసుకుని మీ ఇంటికి వెళ్దాం. వినాయక చవితి అయి 5 రోజులు అయింది కదా? ఈరోజు నిమజ్జనం చెయ్యాలి." అన్నాడు సాయి.


భలే ఉంది, అమెరికాలో నిమజ్జనం కూడానా అనుకుని నేను ఆశ్చర్యపోయాను. సాయి ఇంటికి చేరాక ఇంకొక స్నేహితుడు(వెంకట్) వినాయకుడు బొమ్మ, పూజకి వాడిన పూలు,పండ్లు సంచిలో పెట్టుకుని కొడుకు(టింకూ)తో పాటూ వచ్చాడు.


"బాగుంది, నిమజ్జనం పెద్ద ఎత్తున జరుగుతుందే" అని వెంకట్ ని పలకరించాను.


సాయి స్నానం పూర్తయేలోపల మేము కాఫీలు తాగి రెడీగా ఉన్నాము. వినాయకుడికి పూజ చేసి నిమజ్జనానికి అన్నీ సర్దుకుని మళ్ళీ వేను ఎక్కాము.ఈసారి వేనులో నేను,సాయి,వెంకట్,టింకూ ఉన్నాము.నాకయితే చాలా సరదాగా ఉంది ఇపుడు నిమజ్జనానికి ఎక్కడకి వెళ్తున్నామో అని. సమయం 7 దాటి 30 నిముషాలయింది,చీకటి పడడానికి ఇంక ఎంతో సేపు పట్టదు.3 మైళ్ళు వెళ్ళాక ఒక ఇంటి ముందు వేను ఆగింది.సాయి కిందకి దిగి ఇంట్లోకి వెళ్ళి ఇంకొక వినాయకుడిని సంచిలో పెట్టుకుని వచ్చాడు.సాయి రెండు సంచులు,వెంకట్ ఒక సంచి,నా మెడలో కెమెరా,టింకూ చేతిలో టార్చ్ లైటుతో ఇంటి వెనక చెట్లవైపు నడిచాము.అప్పటికి చీకటి పట్టింది,గుబురు చెట్లలోకి వెళ్ళేసరికి అడవిలో వేటకి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది నాకు.అంతకు ముందు రాత్రి రాం గోపాల్ వర్మ "అడవి" సినిమా హిందీలో చూసాను.ఇంచుమించు అటువంటి అడవిలాగే ఉంది,కాకపొతే నీళ్ళు కనపడలేదు ఇంకా. చెట్లలో పూలు,పండ్లు సామగ్రి పడేసారు. ఇక మిగిలింది వినాయక నిమజ్జనం. ఇంకొంచెం అడవిలోకి వెళ్ళడం మొదలు పెట్టాము. ఎటు చూసినా పెద్ద,పెద్ద చెట్లు. కొన్ని అయితే కింద పడిపోయి దారికి అడ్డంగా ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని దాటుకుంటూ వెళ్తున్నాము. ముందు సాయి, అతని వెనక వెంకట్,టింకూ, చివర నేను నడుస్తున్నాము ఒకరి వెనక ఒకరు. ఉన్నట్టుండి దారి ఆగిపోయింది,మళ్ళీ కొంత దూరం వెనక్కొచ్చి ఇంకొక దారిలో వెళ్ళాము. అలా ఒక 10 నిముషాలు నడచిన తర్వాత నీళ్ళ శబ్దం వినిపించింది. ఒక చిన్న బ్రిడ్జి,దాని కిందగా నీళ్ళు పారుతూ ఉన్నాయి. సాయి,వెంకట్ మెల్లగా నీళ్ళలో వినాయకుడిని దించారు. అక్కడ అందరం ఒక ఫోటో తీసుకుని వెనక్కి బయలుదేరాము. అపుడపుడూ బాగా చీకటిగా ఉన్నప్పుడు టార్చ్ లైటు వేస్తూ నడుస్తున్నాము. ఇంతలో కొంత దూరంలో ఎవరో పరిగెత్తినట్టు శబ్దం, "ఎవడో వేటగాడు జింక అనుకుని మమ్మల్ని కాలుస్తాడేమో" అనుకున్నాం.తీరా చూస్తే రెండు జింకలు మేమెక్కడ కాలుస్తామో అనుకుని బెదిరి చెంగు చెంగున ఎగురుతూ వెళ్తున్నాయి. ఈసారి దారి తప్పకుండా అడవిలో నుండి బయటపడ్డాం. చాల సేపు నడక వల్ల అందరికీ చమటలు పట్టాయి. వేనులో సాయి ఇంటికి వెళ్ళి వెంకట్,టింకూని దింపేసాక మా ఇంటి వైపు బయలుదేరాము. అప్పటికి రాత్రి 9 దాటింది.


"మామూలుగా అయితే ఆఫీసు నుండి నేరుగా ఇంటి వెళ్ళేవాళ్ళు.ఈరోజు చూసారా,అఫీసు నుండి మార్టుగేజు మీటింగు,తర్వాత ఏర్ పోర్టు,ఇంక వినాయకుడి నిమజ్జనం కూడా చూసారు" అన్నాడు సాయి.

"నిజమే,ఉదయం లేసి ఈరోజు ఇలా ఉంటుందనుకోలేదు నేను" అన్నాను.

నన్ను ఇంటి ముందు దింపి "ఈరోజు జరిగిన విశేషాలతో మీ బ్లాగులో రాయండి" అన్నాడు సాయి.

"అలాగే" అని నవ్వుతూ తల ఊపి సాయికి టాటా చెప్తూ ఇంట్లోకి నడిచాను.

7 comments:

పరిమళం said...

శ్రీ గారు , నాకధకు పేరడీ రాస్తున్నారనుకున్నా :)
బావున్నాయి మీ ఇంకో రోజు కబుర్లు !

శ్రీ said...

--)

నేను రాసేసరికి ఆ టైటిల్ తో మీరు విరగ రాసేసారు. అందుకే "ఇంకో" రోజు అన్నా.

మీకు నచ్చినందుకు సంతోషమండి.

కొత్త పాళీ said...

Sree, you have excellent narrative style. I'd strongly encourage you to write fiction.

బుజ్జి said...

అమెరికా లో సమోసానా??

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు.

రాయడానికి ప్రయత్నిస్తాను.

భలే బుజ్జి! సమోసా ఒక్కటేనా, ఇక్కడ కిళ్ళీలు కూడా దొరుకుతాయి.

Bhãskar Rãmarãju said...

కేక

శ్రీ said...

థాంక్స్ బాసు