Monday, April 26, 2010

తన కోపమే తన శత్రువు


వారంతం స్నేహితులతో పిచ్చాపాటీల మధ్యలో ఎందుకో నా మీద కాసేపు చర్చ జరిగింది. మనవాడికి అసలు కోపమే రాదు! నవ్వుతూ ఉంటాడు,కోపం రావడం ఎపుడూ చూడలేదు! ఎవరయిన కొట్టినా కూడా ఇతనికి కోపం రాదేమో ? అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.


నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. సమయం వచ్చింది కాబట్టి వీళ్ళకి ఫ్లాష్ బాక్ చెప్పాల్సిందే అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచా. ఇంత పెద్ద నిట్టూర్పు గమనించిన ఇద్దరు తప్పించుకోవడానికి విఫలయత్నం చేసారు. నేనే, నేర్పుగా వాళ్ళని అడ్డగించి బలవంతంగా కూర్చోబెట్టి ఫ్లాష్ బాక్ చెప్పడం మొదలుపెట్టా.


**************************


అవి నేను పొదలకూరులో ఆరవ తరగతి చదువుతున్న రోజులు. నాకు స్కూలుకి వెళ్ళడం అప్పట్లో కొత్త. ఎందుకంటే నా 2,3,4 తరగతులంతా ఇంట్లోనే జరిగాయి. ఇంట్లో ఎందుకు చదవాల్సి వచ్చిందో ఇపుడు నేను చెప్పలేను. మళ్ళీ ఎందుకంటే ఫ్లాష్ బాక్ లో ఫ్లాష్ బాక్ మొదలుపెట్టిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయ్యాయి, ఉదాహరణకి దుబాయ్ శీను, పౌర్ణమి.


నాకు చిన్నపుడు ముక్కు మీద కోపం! అంకుశం రాజశేఖర్ లాగా అందరినీ విపరీతంగా కొట్టేసేవాడిని. ఒక రోజు క్లాసు అయిన తర్వాత నేను బయట బాతాఖాణీ లో బిజీగా ఉన్నపుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ నా చుట్టూరూ తిరిగారు. వాళ్ళలో ఒకడు (సునీల్) బాలన్స్ తప్పి నా మీద పడి నన్ను కింద పడేసాడు. నాకు తిక్క రేగి సునీల్ సారీ చెపుతున్నా వినక విపరీతంగా కొట్టేసా. సునీల్ నన్ను ఏమీ అనకుండా పాపం వెళ్ళిపోయాడు.


ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకి నాకు విపరీతమయిన జ్వరం వచ్చింది. మందులతో జ్వరం తగ్గకపోయేసరికి డాక్టర్ దగ్గరకి నన్ను తీసుకువెళ్ళాలని ఇంట్లో తీర్మానించారు. డాక్టర్ మాట వినగానే నేను యధా ప్రకారం పరిగెత్తడం మొదలుపెట్టా. ఒక అరగంటకి నా రెక్కలు పట్టుకుని డాక్టర్ ముందు ప్రవేశపెట్టారు. డాక్టర్ కుశల ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టాడు. అంటే నన్ను సూదితో పొడవడానికి సిద్ధమవుతున్నాడన్నమాట! ఇది తల్చుకోగానే నాకు చమటలు పట్టడం మొదలుపెట్టాయి.


"డాక్టర్! నా జ్వరం తగ్గిపోయింది, ఇదుగో చమట్స్ కూడా కారుతున్నాయ్!" అని ఘరానామొగుడులో చిరంజీవిలా అరిచాను.


*** అప్పటికి ఘరానామొగుడు విడుదల అవ్వలేదని అనానిమస్సులు గమనించగలరు ***


ఈలోపల డాక్టర్ రూం లోకి ఒక కుర్రాడు ప్రవేశించి డాక్టర్ మెడ చుట్టూ చేతులు వేసి "నాన్నా!" అంటూ కావిలించుకున్నాడు.


"అబ్బా..మీ ముదురు చర్మం మీ వయస్సుని తెలియనివ్వడం లేదు సుమండీ!" అని అనలేకపోయాను. ఎందుకంటే అప్పటికి టీవీలు లేవు, సంతూర్ సబ్బు ప్రకటనలు లేవు!


ఆ కుర్రాడు ఎవరో కాదు, మన సునీలే! ఆ సమయంలో అతన్ని అక్కడ చూసి నా పై ప్రాణాలు ఇంకా పైకి పోయాయి. వీడు పై సీనులో దెబ్బలు తిన్నాడు కదా, ఇపుడు నా మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో ? వీళ్ళ నాన్నకి చెప్పి నా పొట్ట నిండా సూదితో పొడిపిస్తాడేమో ? ఇలా సా...గాయి నా అలోచనలు.


ఎలా వచ్చాడో, అలాగే వెళ్ళిపొయాడు సునీల్. డాక్టర్ నా చేతికి సూది వేసేసాడు. కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు, క్షనికావేశంలో సునీల్ ని కొట్టానన్న బాధ తప్ప! అప్పటి నుండి నేను, సునీల్ మంచి మిత్రులుగా ఉండిపోయాం.

6 comments:

Prasad Samantapudi said...

మీలో నిద్రిస్తున్న అంకుశం రాజశేఖర్ని డిస్టర్బ్ చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట! :-)

శ్రీ said...

--)

Rama Prasad said...

మొత్తానికి మీకు ప్రధమ కోపము ఉండేది అని చెప్పారు, అయితే మీతో జాగ్రత్తగా ఉంటాము మాస్టారు !!
కాని ఒక ఆత్మ పరిశీలనాత్మక విషయాన్ని ప్రస్తావించారు, ఏమిటనగా మన బలహీనతను మనము గుర్తించగలిగి ఉండి , దాన్ని జయించడానికి ప్రయత్నము చేయాలని చెప్పారు !!
చాలా సంతోషము
ఇట్లు
రామ ప్రసాదు

భాస్కర్ రామరాజు said...

ఆ వయసులో అందరికీ అంతేనేమో!!
మా వాడికిప్పుడు ఐదేళ్ళు. కోపం వస్తే వెంటనే చెప్పేయొచ్చు. ముక్కు పుటలు ఎగసెగసిపడుతుంటాయ్..

భాస్కర్ రామరాజు said...

పుటోబు ఎవరిదీ??

శ్రీ said...

థాంక్స్ రాం ప్రసాద్ గారు.

ప్రధమ కోపం గురించి చక్కగా చెప్పారు.

@ భాస్కర్ రామరాజు,

ఫొటో నాదేనండి, చిన్నప్పటి ఫోటో!