Tuesday, June 1, 2010

కాలాతీత వ్యక్తులు



3 నెలల నుండి చదువుతున్న నవలకి నిన్ననే మంగళం పాడి పూర్తి చేసా. ప్రతి సారీ పుస్తకం సగం చదివి చర్చకు వెళ్తుంటే విసుగు పుడుతుంది, అందుకే వీలు దొరికినపుడల్లా విక్రమార్కుడి లాగా చదివి పుస్తకం పూర్తిగా చదివేసా. అయ్యో..అపుడే పుస్తకం అయిపోయిందా ? అని కొంచెం బాధేసింది. పుస్తకం చదువుతూ మధ్యలో ఇది 1950 లో రాసిన నవలేనా ? అని అనుమానం వచ్చి రెండు,మూడు సార్లు అట్ట వెనకాల చదివాక గానీ నమ్మకం కుదరలేదు. భలే రాసిందే శ్రీదేవి అని చాలా సార్లు అనుకున్నా. పాపం, పెద్ద ఆమె! చిన్న వయసులొనే పోయిందట!!



ఈ పెద్ద కథలో (నవల కూడా కథే కదా...కాకపొతే పెద్దది)విషయానికి వస్తే ప్రకాశం ఎంబీబియెస్ చదువుతూ ఉంటాడు. తండ్రి ఇతని చిన్నపుడు చనిపోయిఉంటాడు, మేనమామ అదుపాజ్ఞలలో బతుకుతూ ఉంటాడు. మడిసి మంచోడే, కొంచెం పిరికోడు. ఇతని ఇంటికి దగ్గరలోనే ఇందిర ఉంటుంది, గడుసమ్మాయి. ఒక చిన్న ఆఫీసులో టైపిస్టు ఉద్యోగం చేస్తూ, ఇంట్లో నాన్నని పోషిస్తూ సినిమాలు, షికార్లు తిరుగుతూ ఉంటుంది. కృష్ణమూర్తి అని ఇంకొక బడుద్దాయ్, బియే చదువుతూనే ఉంటాడు, పరీక్షలు రాస్తూనే ఉంటాడు. వీళ్ళ ముగ్గురి జీవితాల్లోకి కళ్యాణి అడుగుపెడుతుంది. కళ్యాణి సగటు ఆడపిల్ల, సినిమా కష్టాలన్నీ ఈమెకే ఉంటాయి, అపుడపుడూ నవ్వుతూ ఉంటుంది. ఇందిర నాన్న మాటలతో కోటలు కడుతూ ఏమీ చెయ్యక కాలక్షేపం చేస్తూ ఉంటాడు.



వీళ్ళందరి మధ్యలో ఊహించని విధంగా ఈ పెద్ద కథ సాగుతుంది. నాలుగు స్తంభాలాట లాగా జంటలు అటు,ఇటు గెంతుతూ ఉంటారు. కృష్ణ మూరి విలాస జీవితం, సమాజానికో సవాల్ అంటూ తిరిగే ఇందిర, సర్దుకుపోదాం రండి అనుకునే ప్రకాశం, కన్నీళ్ళు తుడుచుకునే కళ్యాణి పాత్రలని నడిపించడంలో రచయిత్రి డా.శ్రీదేవి గారు కృతకృత్యులయ్యారు. ఇన్ని వత్తులతో రాసాను అంటే "చాలా బాగా రాసారు" అని అర్ధం. ఈ పెద్ద కథ సగం దాటిన తర్వాత ప్రవేశించే వసుంధర, డా.కృష్ణమూర్తి స్టీరింగు లాక్కుని కొన్ని మైళ్ళు నడిపించి కథ ముగిస్తారు.



చివరి యాభయ్ పేజీలలో కథ ముగించాలి కాబట్టి అన్ని పాత్రలని హడావిడిగా ముగించేసిందేమో అని నా అభిప్రాయం. ఏమోలే! ఇండియా బాటింగ్ చేసేటప్పుడు కూడా వికెట్లు టప,టపా రాలిపోతాయి కదా! ఈ నవల ద్వార నాకు తెలిసిన ఇంకొక కొత్త విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ఆడ,మగ స్నేహితులు కలిసి ఒక రిక్షా ఎక్కరట, ఇద్దరు రెండు రిక్షాలలో వెళ్తారట. ఒకే రిక్షా ఎక్కడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో? 10 సంవత్సరాలు పట్టిందా? లేక 20 సంవత్సరాలు పట్టిందా? మీకు తెలిస్తే దయచేసి కొంచెం చెప్పండి. అలాగే మీకు వీలున్నపుడు ఈ పుస్తకం చదవడం మర్చిపోవద్దు.

5 comments:

Prasad Samantapudi said...

వ్యాసం, రొటీన్ కి భిన్నంగా రాయటంలో `కృతకృత్యులయ్యారు`. ఇలా `రొటీన్ కి భిన్నం` కూడా రొటీనయినట్టుగా ఉంది ఈరోజుల్లో. :-)

సీరియస్ విషయాల్ని కూడా సరదాగా చెప్పే మీ స్టయిల్ బావుంటుంది.

శ్రీ said...

థాంక్స్ ప్రసాద్ గారు

ravi sankar pydi said...

మూడు నెలలు చదివి మూడు ముక్కల్లొ మీ వ్యాసం చాలా బాగుంది, ఇప్పుడు బుక్స్ చదవడం మొదలుపెట్టా - రవి మామయ్య

శ్రీ said...

@ మామయ్య, ఈ పుస్తకం నవోదయలో దొరుకుతుంది. మంచి నవల చదవండి.

Kathi Mahesh Kumar said...

నిజమే..ఏదో ఈ మధ్యనే రాసినట్లుంది నవల. ఇందిర పాత్ర తీరు చూస్తే ఇంకా అంత స్వతంత్ర్యం కలిగినవాళ్ళు పుట్టలేదేమో అనిపిస్తుంది. చాలా మంచి నవల...గొప్పది కూడానూ.