Sunday, October 31, 2010

స్వదేశాగమనం



చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్తున్నా. ఎన్ని సార్లు వెళ్ళినా ప్రతి సారీ ఒక కొత్త అనుభవం. ఎదో కొత్తదనం, ఎంతో ఉద్విగ్నత!  కుటుంబంలో అందరినీ కలవఛ్చు, కలిసి విశేషాలు మాట్లాడుకోవడం, వాళ్ళ విశేషాలు మనం వినడం ఇలా సరదాగా రోజులు క్షణాలుగా గడిచిపోతాయి. మిత్రులందరూ ఎలా ఉన్నారో? అపుడపుడూ దూర వాణిలో మాట్లాడుతూ ఉన్నా, కలిసి సరదాగ గడపడం చాలా బాగుంటుంది. మా కాలాస్త్రిలో మిత్రుల కన్నా బంధువులు ఎక్కువ, అందరి ఇంటికీ తిరిగేసరికి ఒక వారం ఇట్టే గడిచిపోతుంది.




ఈసారి కాలాస్త్రి వీడియోలు బాగా యూ ట్యూబులో పెడదామని నిశ్చయించుకున్నాను. కాలాస్త్రిలో కన్నప్ప కొండ, స్వర్ణముఖి, గంగమ్మ గుడి తిరగాలి. అలాగే మా ఊరిలో పడిపోయిన గోపురం గురించి కొంచెం ఆరా తీయాలి, వాస్తు పరంగా అది ఊరికి మంచిదో, చెడ్డదో! కాలాస్త్రిలో, సూళ్ళూరుపేటలో రాజకీయాలు ఎలా ఉన్నాయో? కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులని కలిసి జిల్లా రాజకీయాలని ఒకసారి మళ్ళీ దగ్గరగా పరీక్షించాలి. సూళ్ళూరుపేటలో రమణవిలాస్ లో చైనీస్ నూడుల్స్ తినాలి, క్రితం సారి నాకోసం రామచంద్రయ్య ప్రత్యేకంగా చేసాడు. ఒక పది రోజులు నాకు పల్సార్ కూడా ఇచ్చాడు కదా! వాళ్ళ అమ్మాయికి టెన్నిస్ కోచింగ్ ఎంతవరకు వచ్చిందో? యువజన కాంగ్రెస్ నాయకుడు పెమ్మారెడ్డి త్రిలోక్ చంద్రారెడ్డి హయాంలో సూళ్ళూరుపేట సుభిక్షంగానే ఉంటుందిలే! మన ఇంటి పక్కనే ఉన్న చెన్నపట్నం వెళ్ళి మా అఫీసువాళ్ళని కలవాలి. ఈమధ్యనే చెన్నైకి మారిన స్నేహితుడికి ఒక ఆయాని, డ్రైవరుని కుదిర్చి మనవాడిని మదరాసు పట్టణం చూపించాలి.




మా చిన్ననాటి స్నేహితులు ఆస్లాం, జమీల్ ని ప్రతి సారీ కలుస్తూనే ఉంటా. పాపం, ఈ సంవత్సరం అస్లాం వాళ్ళ నాన్న చనిపోయారట, మనవాడిని ఒకసారి కలవాలి.  అస్లాం వాళ్ళ అమ్మ కోడి పలావ్ భలే వండుతుంది. జమీల్ 
వాళ్ళ ఇంట్లో సేమియా తో చేసే స్వీటు భలే ఉంటుంది. బాగా తినేసి రాపూరు అంతా చుట్టి నా హైస్కూలు మిత్రులని కలవాలి. రాపూరు నుండి చిట్వేల్ వెళ్ళే దారిలో సిద్దళేశ్వర కోన చాలా బాగుంటుంది, ఈసారి ఆ కోన అందాలని 
కెమెరాలో బంధించి మీకందరికీ పండగ చేస్తా. లక్ష్మి ప్రసన్న, వెంకట సుబ్బమ్మకి ఎంత మంది పిల్లలో? కాకుల కొండ ఎలా ఉందో? వీలయితే ఒకసారి ఎక్కి చూడాలి. ఈ మధ్య గూడూరుకి చెందిన ఒక స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే తెలిసింది, సైదాపురం దగ్గర కూడా ఒక కోన ఉందట. చాలా బాగుంటుంది, ఈసారి వెళ్లినపుడు తప్పకుండా చూసేసి రండి అని చాలా సార్లు చెప్పాడు.




పెంచలకోన ఐతే మనం తప్పకుండా వెళ్ళాలి, క్రితం సారి వెళ్ళినపుడు బాగా ఫోటోలు దిగాను. ఎండాకాలం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు "ఓహో" అనేలా జరుగుతాయి ఇక్కడ. పొదలకూరులో మా స్నేహితులు నాకు పెద్దగా గుర్తు లేదు. కృష్ణ మాత్రం కొంచెం గుర్తు ఉన్నాడు, ఇపుడు ఎక్కడ ఉన్నాడో మాత్రం తెలియదు. పొదలకూరులో వినాయకుడి గుడి చాలా పెద్దదిగా ఉంటుంది. గుడిలో వినాయకుడు పెరుగుతూ ఉన్నాడని విగ్రహం తల పైన చీల కొట్టారని అంటే చిన్నపుడు నమ్మేసా! ఈ ఊరిలోనే మనం చిన్నపుడు కట్లపాముతో ఆడుకున్నది. చిన్నపుడు మనం చంటి టైపు, అన్నీ ఇంట్లోనే! తెలుగు అయ్యవారు ఇంటికి వచ్చి తెలుగుతో పాటూ ఇంగ్లీషు, లెక్కలు నేర్పించి తొడపాశాలు పెట్టేవాడు. ఆయన కూతురు ఉమక్క అక్కడే ఉందో , ఏమో?




ఇంక నెల్లూరులో రేఘవా సినీ కాంప్లెక్సు, అర్చన, నర్తకి, లీలామహల్ సినిమా హాళ్ళని దర్శించాలి. వెంకటరమణ హోటల్ లో సింగపూర్ పరాటా, మురళీ కృష్ణలో నెల్లూరు చేపల పులుసు రుచి చూడాలి. న్యూ టాకీస్, కనకమహల్ ఉన్నాయో, లేక కొట్టేసి అపార్ట్ మెంట్లు కట్టేసారో ? తిరుమల మనకి తప్పని సరి, ప్రతి సారీ మనకి దర్శనం సులభంగా చేస్తూ ఉండే సునీల్ ఈసారి ఒట్టి మనిషి కూడా కాదు, మొన్ననే పెళ్ళయింది. మన వాడికి ఎదో ఒకటి తీసుకు వెళ్ళాలి. క్రితం సారి ఆంధ్రజ్యోతిలో పని చేసే ఉమామహేశ్వర రావు గారిని కలిసాను, ఈసారి అతనినీ నామిని గారినీ కూడా ఈ సినబ్బ కలవాల్సిందే. వెళ్ళిన ప్రతిసారీ రెండింతలు అవుతున్న కాణిపాకం ఈసారి ఎలా ఉందో? క్రితం సారి వెల్లూరు వెళ్ళలేక పోయాను, అక్కడ అమ్మవారి గుడి మొత్తం బంగారంతో కట్టారట. మదనపల్లికి వెళ్ళడం వీలవుతుదో లేదో? మొన్న ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున మా కాలేజీ సీనియర్ నిలబడి ఓడిపోయాడు, నిన్నటి రక్త చరిత్ర కి ఒకానొక నిర్మాత కూడా. అతనిని కలిసి వీలయితే కప్పు కాఫీ తాగాలి.




ఒంగోలు, విజయవాడ వెళ్ళాలి కదా! అక్కలిద్దరూ అక్కడే, అక్కడ నుండి వీలయితే కోనసీమ ఒకసారి వెళ్ళి చూడాలి. నవోదయా రాం మోహన్ రావుగారిని కలిసి కొత్త పుస్తకాలు కొనాలి, ప్రకాశం బారేజీ దాటి తాడేపల్లి వెళ్ళి అత్తమ్మ, మామయ్యలని పరామర్శించాలి. మొగల్రాజ పురంలో గుహలు చూసి రావాలి, ఈమధ్యనే ఫోటోలు కూడా చూసాను. హన్మకొండ సరేసరి! ఈసారి మా మామగారి తరపున ఒక పెళ్ళి కూడా ఉంది. కొత్త బంధువులందరినీ ఒకసారి కలవచ్చు. క్రితం సారి కాళరేఖలు నవీన్ గారిని కలిసాను, మళ్ళీ కలిసి మేష్టారు కొత్త నవలలు ఏమన్నా రాసారో, లేదో తెలుసుకోవాలి. ఈమధ్యే చదివిన ప్రయాణంలో ప్రమదలు గురించి నా అభిప్రాయాలు చెప్పాలి. నవీన్ గారిని కూడా ఒక బ్లాగు మొదలుపెట్టమని అడగాలి. హైదరాబాదులో మన బ్లాగర్లు ఎలా ఉన్నారో? క్రితం సారి కూడా ఎవరినీ కలవలేదు, ఈసారి బ్లాగర్ల సమావేశానికి వెళ్ళి అందరినీ కలిస్తే బాగుంటుంది. అలాగే కాలేజీలో చదివిన పాత స్నేహితులు ఈమధ్య మళ్ళీ తగిలారు, వాళ్ళతో ఒక సిట్టింగ్ వేసి పాత జ్ఞాపకాలు తిరగేయాలి. 

5 comments:

VENKATA SUBA RAO KAVURI said...

అమ్మో, మీ ముందస్తు ప్రణాళిక మన రాష్త్ర ఆర్థిక వార్షిక ప్రణాళిక తరహా కాకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

కొత్త పాళీ said...

Have a safe journey

వేణూశ్రీకాంత్ said...

గుడ్ చాలానే ప్లాన్ చేసుకున్నారుగా :-) అనుకున్న పనులన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాను. Have a safe and pleasant journey.

శ్రీ said...

అందరికీ నెనర్లు

sree said...

Baga plan chesaru. Sundar deluxe pada kottesi siri plex ani multiplex kattaru. dantlo ee kotha cinema release aina flop (Namo venkatesa, Puli). Ennar cine Vilas (Venkataramana, indira, padamavathi, Seven Hills) oka danini unchi migathavi destroy chesthunnarata for multiplex.