Sunday, October 17, 2010

7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు



రెండు నెలల ముందే వంగూరి చిట్టెన్ రాజు గారు ఏడవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులకి రమ్మని లేఖలు రాసారు. వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, ఇంతలో కొత్తపాళీ గారు వెళ్దామా అంటే ఇంచుమించు ఎగిరి గంతేసాను. ఇంకొక ఇద్దరు మిత్రులు కూడా రావలసింది, వృత్తి, కుటుంబ వ్యవహారాలు అడ్డొచ్చి రాలేకపోయారు. వారం ముందు నుండే సభకి రిజిస్టరు చేసుకున్నాం. రెండు రోజులు ఉండడానికి హోటల్ కూడా బుక్ చేసేసారు కొత్తపాళీ గారు. 




శనివారం ఉదయం ఆరు గంటలకి డెట్రాయిట్ నుండి బయలుదేరి ఇంచుమించు అయిదు గంటలు ప్రయాణం చేసి 11 గంటలకి ఇండియానా పోలీస్ చేరుకున్నాం. నేరుగా వెళ్ళి సభలో కూర్చున్నాం. సుప్రసిద్ధ కథా రచయిత, మైనారిటీ వర్గ తాత్విక శాస్త్రవేత్త అయిన డా. బి.ఎస్. రాములు గారు తెలుగు భాష గురించి ఉపన్యాసం దంచుతూ ఉన్నారు. అప్పటికే ముఖ్య అతిథుల ప్రసంగాలు అయిపోయాయి. కాసేపయ్యాక సుప్రసిద్ధ కవి, పౌరాణిక రంగస్థల నటులు అయిన డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ధూర్జటి కవి గారి శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి పద్యాలు చదువుతూ అందరినీ రంజింప చేసారు. తరువాత చిట్టెన్ రాజు గారు ఉగాదికి నిర్వహించిన ఉత్తమ కవిత, కథల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేసారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ సాహితీ సదస్సులో పుస్తక ఆవిష్కరణ ఒక భాగం, ఈసారి "అమెరికా తెలుగు కథానిక" ఎనిమిదవ సంకలనం ముఖ్య అతిథి చేత ఆవిష్కరించారు. అది కాక ఇంకా ఆరు, ఏడు పుస్తకాలు ఆవిష్కరించడం జరిగింది. వాటిలో అమెరికా ఇల్లాలి ముచ్చట్లు, వేమన గురించి ఒక పుస్తకం, క్రైస్తవ పాటల మీద ఒక పరిశోధన పుస్తకాలు ఉన్నాయి. ఈమద్యే స్వర్గస్తులయిన శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారి జ్ఞాపకార్థంగా శ్రీ మోహన్ దేవరాజు గారు సంకలనం చేసిన ఆడియో సీడీని కూడా ఆవిష్కరించారు. ఈ సదస్సుకి వచ్చిన తెలుగు భాషాభిమానులందరికీ ఈ సీడీని ఉచితంగా ఇచ్చారు.   




ఇంతలో ఆకలి రాముడు గంట కొట్టడంతో చవులూరించే శాఖాహార వంటకాలతో అద్భుతమయిన భోజనం లొట్టలు వేసుకుంటూ తిన్నాము. భోజనానంతరం జరిగిన స్వీయ రచనా పఠణానికి మన కొత్తపాళీ గారు అథ్యక్షత వహించారు. ఇల్లాలి ముచ్చట్లు, మోడరన్ సత్యభామ కథలు సరదాగా సాగాయి. అలాగే ఉగాది కథల పోటీలలో ప్రధమ బహుమతి పొందిన సుధా నిట్టల గారి 'యత్ర నార్యస్తు పూజ్యంతే" కథ యువతరం అలోచింపచేసేదిగా సాగింది. అల్పాహార విరామంలో కొత్తపాళీ గారు ప్రపంచ ప్రఖాత కవి అఫ్సర్ గారిని, యువతరం గర్వించే నేటి కవి నల్లా చక్రవర్తుల కిరణ్ ని నాకు పరిచయం చేసారు. మసాలా చాయ్ తాగడం అయ్యాక మొదలయిన సాహిత్య చర్చా వేదిక సరదాగా సాగింది. తెలుగు బ్లాగులపై కొత్తపాళీ గారి ప్రసంగం ఆసక్తిగా సాగింది, సభలో చాలామంది రచయితలు బ్లాగులపై ఆసక్తి చూపారు. సదస్సు జరిగిన హోటల్ లోనే మా బస కూడా. హోటల్ లో చెక్-ఇన్ అయిపోయి స్నానాలు చేసాక ప్రయాణ బడలిక, సాహిత్య ధూళి నుండి కొంత విశ్రాంతి దొరికింది.




ఇక ఆరోజు మిగిలిన కార్యక్రమం మూడవ ఘంటసాల ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీమతి దివాకర్ల సురేఖా మూర్తి, అపర ఘంటసాల శ్రీ బాలకామేశ్వర రావు గారి ప్రత్యక్ష గానం. ప్రతి సంవత్సరం ఘంటసాల ఆరాధనోత్సవాలు జరుపుతూ దాతలు ఇచ్చిన డబ్బుల ద్వారా హైదరాబాదులో వికలాంగుల కోసం వేగేశ్న ఫౌండేషన్ ఒక స్కూలు నడుపుతారు. వేగేశ్న ఫౌండేషన్ గురించి ఆ కంపెనీ ట్రస్టీ శ్రీ వంశీ రామరాజు గారు కాసేపు మాట్లాడారు. ఘంటసాల పాటలతో వీనులవిందుగా సంగీత కార్యక్రమం సాగింది. తర్వాత జరిగిన కార్యక్రమం పెద్ద హైలెట్! కొత్తపాళీ గారు, అఫ్సర్ గారు, కిరణ్ తో జరిగిన కబుర్లతో గంటలు క్షణాలుగా దొర్లాయి. అఫ్సర్ గారు శ్రీశ్రీతో తన పరిచయం గురించి వివరిస్తూ ఉండగా అందరం పరవశిస్తూ విన్నాం. సాహిత్యం, వైష్ణవం, బ్లాగులు ఇలా అన్నిటిపై కబుర్లు అర్ధరాత్రి వరకు సాగాయి. 




ఆదివారం కూడా స్వీయ రచనా పఠణంతో శ్రీమతి సురేఖా మూర్తి అద్యక్షత వహించగా కార్యక్రమాలు మొదలయ్యాయి. డా. ద్వానా శాస్త్రి గారు రాసిన పుష్ప విలాపాన్ని బాలకామేశ్వర రావు గారు పాడి వినిపించారు. అఫ్సర్ గారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి కాసేపు మాట్లాడారు. ఉగాది కవితల పోటీలలో ప్రధమ బహుమతి పొందిన నచకి (నల్ల చక్రవర్తుల కిరణ్) తన కవితలు వినిపించి అందరి చేత మన్ననలను పొందారు. సాహిత్య సదస్సుకి ముఖ్య అతిధిగా విచ్చేసిన డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు హిందీ, తెలుగులో అనర్గళంగా ప్రసంగించి సభలో వాగ్ధానాలను కురిపించారు. మధ్యాహ్న భోజనానంతరం అందరి దగ్గరా సెలవు తీసుకుని మూటా, ముల్లె సర్దుకుని తిరుగు ప్రయాణం కట్టాం. 


రెండు రోజుల కార్యక్రమంలో కొన్ని వీడియోలు మీ కోసం ఇక్కడ పెట్టాను.





































    

6 comments:

Anonymous said...

inka details istE bagunTundanipinchindi..duranga vundi ila vidiolu chusi anandinchE vaLLam kadaa andukani..
emaina baga raasaru...
lakshmi raghava

శ్రీ said...

థాంక్స్ లక్ష్మి రాఘవ గారు

కొత్త పాళీ said...

good show

Anonymous said...

మంచి కథనం. వీడియోలతో సహా వ్రాసినందుకు నెనర్లు. (నా వీడియో తీసినందుకు ప్రత్యేకంగా నెనర్లు.) ఇకపోతే కొన్ని సవరణలు:

* అక్కడ ఆవిష్కరించిన పుస్తకాలలో ఒకతి "అమెరికా తెలుగు కథానిక", నిజమే, కానీ ఇది 11వ సంకలనం.
* పుష్పవిలాపం వ్రాసినది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారైతే ఇక్కడ పాడినది ద్వాదశి హరేరామ శర్మ గారు (ద్వానా శాస్త్రి గారు కాదు, వారి తమ్ముడు) వ్రాసిన "పుష్పవిలాసము".
* నా పేరు "నల్లాన్ చక్రవర్తుల కిరణ్". ఆ నకార పొల్లును వదిలేసి నన్ను "నల్లా" దగ్గర "నల్ల" పిల్లవాడిగా వదిలేస్తారేమోననే ఆ భాగం రికార్డులకెక్కలేదు. :-)
* నాకు ఉగాది కవితల పోటీలో వచ్చినది "ప్రశంసాపత్రం" మాత్రమే... ప్రథమ బహుమతి కాదు.

మీ కథనం పుణ్యమా అని మఱో సారి ఆ సదస్సు తాలూకు స్మృతులు మెదిలాయి. (వీడియోల వలన "కళ్ళకు కట్టినట్టుగా" అని ప్రముఖంగా చెప్పాలి.) మిమ్మల్ని, అఫ్సర్ గారిని, కొత్తపాళీ గారిని కలవటమే కాక పొద్దుపోయిన తఱువాత చెప్పుకున్న పిచ్చాపాటీ కబుర్లు (పొద్దుటి నుంచి ఉన్న అలసట, సాహిత్యపు జల్లుల నుంచి) చాలా తెఱిపినిచ్చాయి. (నేనూ పూర్తిగా ఉండగలిగితే :-( బాగుండేది!)

శ్రీ said...

కొత్తపాళీ గారికి, కిరణ్ కి నెనర్లు.

@ కిరణ్, మీ సవరణలకు సంతోషం! పుష్ప విలాసాన్ని విలాపంగ రాసినందుకు మన్నించండి. అలాగే మీ పేరు కూడా ఇక మీదట సరిదిద్దుతాను. శనివారం కార్యక్రమం కూడా వీడియోలు తీసి ఉంటే బాగుండేది.


మన కబుర్లు మాత్రం అద్భుతం, బాగా గుర్తుండిపోయేవిగా జరిగాయి.

తెలుగు అభిమాని said...

సాహిత్యధూళి, ఆకలి రాముడు. -భలే ఉన్నాయి