Thursday, November 25, 2010

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్య మంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

గత వారాంతం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు ఆర్య వైశ్యులందరినీ విజయవాడకి పిలిపించి స్వర్ణ కిరీటం పెట్టించుకున్నారు. మా ఎదురింటి శెట్టి గారు రోశయ్యగారికి జరిగిన కార్యక్రమం గురించి మాకు కనువిందు చేసారు.
సోమవారం అమ్మగారు ఢిల్లీకి పిలిచి రోశయ్య గారి నుండి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు. ఈ కార్యక్రమాన్ని మన మీడియా చంకలు గుద్దుకుని మనందరికీ చూపించిన విషయం మీకు, నాకు తెలిసిందే. 


రాత్రంతా మీడియా చెప్పిన వార్తే చెప్పి, చెప్పి అందరి చెవులూ తుప్పు రేగ కొట్టారు. రాత్రి నెల్లూరు నుండి మిత్రుడు ఫోన్ చేసి కిరణ్ కుమార్ కి కూడా 90% చాన్స్ ఉందట అని చెప్తే నేనే కొట్టి పారేసా. రాత్రి సీ.ఎల్పీ మీటింగులో ప్రణబ్ ముఖర్జీ పక్కనే గీతా రెడ్డి కూర్చునేసరికి ఆమెకి కుర్చీ ఖరారయిందని మేము పందాలు వేసుకోవడం మొదలుపెట్టాం.అమ్మగారికి బాగా కావల్సిన వాడయిన జైపాల్ రెడ్డికి కూడా రాత్రి చాన్స్ ఉండింది. ఒకవేళ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మొదటి వారం తిరగకుండానే ఈనాడు పేపర్లో "కుంటు పడిన రాష్ట్ర ప్రభుత్వం" హెడ్డింగ్ పెట్టి వీర కుమ్ముడు కుమ్మడానికి 45 శాతం అవకాశం ఉండేది. 


రాత్రి పది అయ్యేసరికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా అమ్మగారు తీర్మానించారు. అప్పటివరకు లైన్ లో ఉండి మాట్లాడుతున్న మా స్నేహితుడి ఆడియో కట్ అయ్యి టీవీ 9 లో వీడియో కనపడడం మొదలయింది. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం అని తెలిసింది. రాత్రికి రాత్రి చెన్నై నుండి హైదరాబాదుకి 3 టిక్కెట్లు బుక్ చేసి పెట్టాము. వీ.ఐ.పీ పాసులు దొరకగానే టిక్కెట్టు కొని హైదరాబాదుకి వెళ్ళాలని ప్లాన్. పాసుల కోసం ట్రై చేస్తూ ఉంటే మా వాడి ఆడియో దొరికితే ఒట్టు, వోన్లీ వీడియోనే. అదుగో తెల్ల చొక్కా వేసుకుని మనవాడు కిరణ్ వెనకనే ఉన్నాడు అని, రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాం. నేనయితే మాంచి ప్రాజెక్టు గురించి తెగ అలోచించా. సీ.ఎం మనవాడే, మాంచి ప్రాజెక్టు ఒకటి మొదలుబెట్టి రాష్ట్ర సేవ చేసుకోవడానికి ఇదే అవకాశం కదా!


గతంలో కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి గారు పీలేరు నుండి పలు సార్లు వోడి,గెలిచారట. ఆయన తదనంతరం కిరణ్ కుమార్ గారి తల్లి గారు పోటీ చేసి వోడి పోయారు. *** మన రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ ఎవరికి ఎపుడు పెద్ద ధర్మ సందేహాలు వచ్చి ఉండవ్! నాన్న చనిపొయాడు, ఇపుడు అధికారం ఎట్లా? అని. అయిదో క్లాసు పిలకాయ్ కూడా చాయిస్ చూడకుండా కళ్ళు మూసుకుని చెప్పగలడు మన దేశంలో. ఇది నిజంగా మనం గర్వించదగిన విషయం! *** అదృష్టవశాత్తు పక్క సంవత్సరమే మళ్ళీ ఎన్నికలలోకి పోటీ చేసే అవకాశం మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది. "ఈ ఒక్కసారికి నిలబడు, తర్వాత నీ పని చూసుకోవచ్చు" అని కుటుంబీకులు బలవంతపెడితే కిరణ్ నిలబడి బరిలో గెలిచారు. అప్పటి నుండీ కిరణ్ వెనక్కి తిరగ కుండా రాష్ట్ర ప్రజలకు ముందుకే సేవ చేస్తూనే ఉన్నారు.




మొత్తానికీ మా చిత్తూరు జిల్లా నుండి వచ్చిన రెండో సీ.ఎం మా జిల్లాని ఎంతవరకు పులివెందుల చెయ్యగలడో చూద్దాం. గెలవడానికి నీలం, రామారావు చివరికి చిరంజీవి కూడా మా జిల్లాని వాడుకున్నారు. వీళ్ళని నేను గుర్తించడం లేదని మీరు గమనించగలరు. బాగా తెలివయిన మనిషి, మీరు గమనించే ఉంటారు. వై.ఎస్ ఒకరకంగా మంచి పని చేసాడు. జిల్లా అభివృద్ధికి ఒక ప్రామాణికాన్ని నిర్వచించాడు. మనకి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చూపించాడు. ఇపుడు రోశయ్యనే తీసుకుందాం. తాతగారి ఊరేమిటో నాకు అసలు తెలియదు, తాతగారు గెలిచిన గుంటూరు నియోజకవర్గం అభివృద్ధి 1% పులివెందుల అని చెప్పచ్చంటారా? ఇప్పట్లో ఎలాగూ సద్దు ముణగదు కాబట్టి వచ్చే వారంలో మన కొత్త ముఖ్యమంత్రిని కలిసి హలో చెప్పేసొద్దాం, ఏమంటారు?


3 comments:

మురళి said...

ఆవేళ టీవీ చూస్తూ మీకు అభినందనలు చెప్పాలనుకున్నా.. ఇవాల్టికి కుదిరిందండీ.. ఏ క్రికెట్ బ్యాట్ లు తయారు చేసే పరిశ్రమో అయితే అనుమతులూ అవీ శరవేగంగా వచ్చి పడతాయ్.. ఏమంటారు?

మురళి said...

ఆవేళ టీవీ చూస్తూ మీకు అభినందనలు చెప్పాలనుకున్నా.. ఇవాల్టికి కుదిరిందండీ.. ఏ క్రికెట్ బ్యాట్ లు తయారు చేసే పరిశ్రమో అయితే అనుమతులూ అవీ శరవేగంగా వచ్చి పడతాయ్.. ఏమంటారు?

శ్రీ said...

థాంక్స్ మురళి గారు