గత సంవత్సరం కాలేజీ రీయూనియన్ అపుడు మాకోసం రాసుకున్న జ్ఞాపకాలు. ఇపుడు మీకోసం కూడా...
సెప్టెంబరులో ఒక రోజు. అతడు సినిమా మాటీవీలో మొదలయ్యి అరగంట అయింది.
వచ్చే నెల అక్టోబరు 15 వారాంతంలో మాతోపాటూ నేదురుమల్లి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న స్నేహితులందరూ స్మోకీ పర్వతాలలో కలుద్దామని చాలా రోజుల నుండి అనుకుంటూ వచ్చాము. ఈ వారంలో ఆ ప్రయాణానికి ముందస్తుగా డాలాస్ నుండి బయలుదేరే మిత్రులతో కలిసి టిక్కెట్లు కొనుక్కుని తయారవుతున్నాను. అందరం కలుసుకున్నాక చాలా కబుర్లు చెప్పుకుందామని నిర్ణయించుకున్నాము. కాలేజీ అయిన తర్వాత అంటే 1994 తర్వాత అందరం ఎవరి దారి వారు చూసుకున్నాము. 1998 సంవత్సరంలో ఏ నెలో గుర్తు లేదు, ఒకసారి అందరం నయాగరా జలపాతం దగ్గర కలుసుకున్నాము. అప్పట్లో ఫేస్ బుక్కు, వాట్సాప్ లేవు కాబట్టి చాలా మంది మిత్రులతో చాలా సంవత్సరాల వరకు ఫోనులో సంబంధాలు నిలుపుకున్నాము. కానీ ఊరు మారడం, దానితో పాటూ టెలిఫోన్ నంబర్లు కూడా మారడం మా మధ్య దూరం పెంచింది. మళ్ళీ ఈ ఫేస్ బుక్కుల వల్ల, వాట్సాపుల వల్ల ఫోన్లు తెగ బీపుతున్నాయి. ప్రపంచం నలు మూలలా ఉన్న మిత్రులతో ఫోన్ ఇరవై నాలుగు గంటలూ కుయ్యి,కుయ్యిమంటూనే ఉంది. నెల ముందు నుండీ మా ప్రయాణం గురించి కబుర్లు, ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికి మేము కాలేజీ చేరి పాతిక సంవత్సరాలయింది. నూనూగు మీసాలతో కలిసి చదువుకున్న మేమందరం నడివయస్సులోకి చేరుకున్నాము. అందరం నలభైలు దాటి జుట్టు నెరిసి, ఊడిన స్థితుల్లో ఉన్నాము.
ఇది వ్రాయడం మొదలుపెట్టి ఒక నెల దాటింది. ఇక్కడ నుండి కొత్తగా చదువుకోండి. ఇంక ఒక వారంలో అందరినీ కలవడం జరుగుతుంది.
అప్పట్లో మా కాలేజీకి మంచి పేరు ఉండేది, అంటే ఇపుడు లేదని కాదు. ఇపుడు చాలా కాలేజీలు వచ్చాయి, పేరుతో పెద్ద అవసరం లేదేమో! ఆ చిన్న పల్లెటూరిలో నాలుగు సంవత్సరాలు ఎలా గడిచాయో తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యం వేసేది. మా ఊరు పక్కనే అయ్యేసరికి చాలా ఆదివారాలు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. నేను కాలేజీ హాస్టలులో కాకుండా బయట ఉండేవాడిని. ప్రతి సంవత్సరం ఒక కొత్త రూములో తిరుగుతూ ఉండేవాడిని. కాలేజీల్లో నీరసంగా క్లాసులు, మెస్సుల్లో ఆయాసంగా భోజనాలు, రూముల్లో బ్రేకుల్లేకుండా బాతాఖానీలు, పక్కనే ఉన్న ఊరికి సైకిళ్ళమీద వెళ్ళి సినిమాలు చూడడం, వారాంతం ఇంటికి పోయి సూళ్ళూరుపేటలో సినిమాలు ఇలా చాలా సరదాగా జీవితం దొర్లిపోయింది. నాకు ఊహ రావడం మొదలు, చదువు మేఘాల్లో విహరిస్తూ ఉండేది.
అక్టోబరు 18, దెయ్యాలు ప్రేమించుకునే సమయం.
ముందు రాత్రి పడుకునేసరికి చాలా సమయం అయింది. ఉదయాన్నే ఎనిమిది గంటలకు విమానం. శ్యాము, ఫిరోజ్ తయారయ్యి నన్ను అయిదున్నర ప్రాంతంలో తీసుకుని వెళ్ళేటట్లుగా తీర్మానించాము.
ముందు రోజు రాత్రి ప్రవీణ్ ఫోన్ చేసి "మామా, నువ్వసలే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావ్. ఉదయాన్నే లెయ్యగలవా?" అని ఆశ్చర్యాన్ని వెల్లిబుచ్చాడు.
ప్రవీణ్ కి ధైర్యం చెప్పానే కానీ నాలో కూడా ఆ అనుమానమే కొన్ని క్షణాలు వేసింది. పకడ్బందీగా అలారం పెట్టుకుని పన్నెండు గంటలకు పడుకున్నా. నా సామానంతా రెండు రోజులముందే సర్దేసాను. మా మోటార్ సైకిల్ ప్రయాణానికి వెళ్ళే ముందు ప్రయాణానికి కావలసిన సామాను ఎలా సర్దుకోవాలి అని చాల వీడియోలు చూసాను. రెండు చక్రాల మీద వెళ్ళేటపుడు వీలయిననత తక్కువ, చాలా తెలివిగా సర్దుకోవాలి. ఒక మూడుగంటలు బాగా పడుకున్నా. తరువాత ఇక నిద్ర రాలేదు. మా ఆవిడని బలవంతంగా లేపి కాఫీ పెట్టించి తాగి స్నానం చేసి బట్టలు వేసుకుని శ్యాముకి వాట్సపులో మెసేజ్ పెట్టాను. నాలుగున్నరకంతా నేను రెడీ. ఇంటి పక్కనే ఏటీఏం కి వెళ్ళి మా ఆవిడ అడిగిన డబ్బులు తీసుకుని కారులో పెట్రోలు కొట్టించి ఇంటి దగ్గర పెట్టా. ఈలోపు శ్యాము, ఫిరోజ్ ఇంటికి చేరుకున్నారు. నా లగేజ్ ఫిరోజ్ కారులో పెట్టి నేను వెనక సీటులో కూర్చున్నా. మెరుపువేగంతో బండిని నడిపి అనుకున్న సమయం కంటే ముందే మమ్మల్ని ఏర్పోర్ట్ తీసుకువచ్చేసాడు. ఇతని వేగం చూసి నేను వేసుకున్న రెండు, మూడు సీటు బెల్టులు విప్పి అపుడే వచ్చిన షటిల్ ఎక్కాము. షటిలులో కూర్చుని ఒక ఫోటో తీసుకుని వాట్సాపులో పోస్ట్ చేసాము. ఫిరోజ్ ప్రతి వారం ఏర్పోర్ట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు కాబట్టి మమ్మల్ని ఎక్స్ ప్రెస్ పార్కింగ్ కి తీసుకురావడం, అక్కడే ఉన్న షటిల్ ఎక్కి టెర్మినల్ చేరుకోవడం నిముషాలలో జరిగిపోయాయి. అంతకు ముందే చెక్-ఇన్ అవడం వలన నేరుగా సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి విమానం ఎక్కేసాము. మేము ముగ్గురం చదువుకునే రోజుల్లో విద్యానగర్ హాస్టలులో కాకుండా సెంటరులో ఉండేవాళ్ళం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఇలా కలిసి ప్రయాణించి మిగతా మిత్రులని కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఇదే మాట శ్యాము తరువాత రెండు రోజుల్లో చాలా సార్లు అన్నాడు. విమానంలో కూడా ఇంకొక సెల్ఫీ తీసుకుని మా గ్రూపులో పెట్టేసి పడుకుందామని కాసేపు కళ్ళు మూసుకున్నాం. నేను ఉదయం కొంత సమయం ఉండి సీరియల్ తిన్నాను. శ్యాము కాఫీ తాగాలన్నాడు, ఫిరోజ్ మాత్రం అప్పటికే నిద్రలోకి వెళ్ళాడు. మేమిద్దరం కాఫీ తాగి కాసేపు పడుకున్నాము. అట్లాంటా మాకు తూర్పులో ఉంటుంది, మాకంటే అక్కడ కాలం ఒక గంట ఎక్కువ. మాకు కాలం కలిసి వచ్చి రెండు గంటలలోపే అట్లాంటా చేరుకున్నాము.
నాకు డెట్రాయిట్ లో స్నేహితుడు కళ్యాణ్ ఇపుడు అట్లాంటాలో ఉన్నాడు. అతనికి నేను వస్తున్నానని చెప్పాను. కళ్యాణ్ మాతో పాటూ ఫోర్డ్ లో పని చేసాడు. తరువాత భారతదేశం వెళ్ళడం జరిగింది. నేను 2010 లో చెన్నై వెళ్ళినపుడు ఇద్దరం చెన్నైలో, సూళ్ళూరుపేటలో కలిసి తిరిగాము. ఈమధ్యే మళ్ళీ అమెరికా వచ్చాడు, వచ్చాక ఇపుడే కలుసుకోవడం. ప్రవీణ్, గురునాధం ఫీనిక్స్ నుండి వచ్చి మమ్మల్ని తీసుకుని స్మోకీస్ వెళ్తాడు, అదీ మా పధకం! నేను అట్లాంటా దిగగానే కళ్యాణ్ కి మెసేజ్ చేసాను. అట్లాంటా ఏర్ పోర్టు నాకంటే నాలుగు ఇంచెలు పొడుగు. మా టెర్మినల్ దిగి రైలు ఎక్కి పది నిముషాలు ప్రయాణించాక నేల కనిపించింది. కాసేపయ్యాక కళ్యాణ్ కూడా చేరుకున్నాడు. మా ముగ్గురి సామాను కళ్యాణ్ కారులో పెట్టి ఏర్ పోర్ట్ బయటపడదామనుకున్నాం. అప్పటికి పదకొండు అయింది, కొంచెం ఎంగిలి పడదామని జీపీఎస్ లో మెక్సికన్ రెస్టారెంటు బయలుదేరాము. ఇక్కడ ఒక తమాషా జరిగింది. జీపీఎస్ మమ్మల్ని మళ్ళీ ఏర్ పోర్టు వైపుకి తీసుకువచ్చింది. ఆ రెస్టారెంట్ ఏర్ పోర్టు లోపల ఉంది. ఈ కామెడీ తట్టుకోలేక ఈసారి జాగ్రత్తగా ఒక చైనీస్ హోటల్ వైపు బయలుదేరాము. అక్కడకి చేరుకున్నాక అది నచ్చక పక్కనే ఉన్న లా ఫియస్టా అనే హోటల్ చేరుకున్నాము.
అట్లాంటాలో వాతావరణం చాలా బాగుంది. మా ఊరి కంటే కొంచెం చల్లగా ఉంది. అందరం హోటల్ పాటుయోలో కూర్చుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఈలోపల దేవ్ నాధ్ ఫ్లోరిడా నుండి దిగాడు. మేము ఏర్ పోర్ట్ పక్కనే ఉన్నాము, మా దగ్గరకి రా అని చెప్పాము. అతనికి కారు లేకపోయేసరికి నేను, కళ్యాణ్ వెళ్ళి పది నిముషాలలో తిరిగి వచ్చాము. కాలేజీ తర్వాత దేవాని కలుసుకోవడం ఇదే మొదలు, ఫేస్ బుక్కులో ఫోటోలు మాత్రం చూస్తూ ఉండే వాళ్ళం. అందరం కలిసి కబుర్లతో కడుపు నింపుకుంటూ మధ్యమధ్యలో చికెన్ ఫహీటాలు నంజుకున్నాము.ఈలోపల ప్రవీణ్, గుర్నాధం అట్లాంటాకి వచ్చారు. ఇక్కడ ఇంకొక తమాషా జరిగింది. ప్రవీణ్ కారు తీసుకుని మేమున్న రెస్టారెంటు వైపు వస్తూ ఉన్నాడు. నాకు ఫోన్ చేసి మేము దగ్గరలోనే ఉన్నాము అని చెప్పాడు. నేను వాళ్ళకి పక్కనే ఉన్న చైనీస్ హోటల్ అడ్రెస్ ఇచ్చాను. అక్కడ నుండి కొన్ని అడుగులు వేస్తే మా హోటలు. నేను ఫోనులో ఈ విషయం చెప్తూ ఉన్నాను. ప్రవీణ్ ఇంకాసేపట్లో మీ దగ్గరకి వస్తూ ఉన్నాను అని చెప్పాడు. రోడ్ చూస్తూ మాట్లాడుతున్న నేను ప్రవీణ్ కి కనిపించాను అన్నాడు. నాకు ప్రవీణ్ కారు ఇంకా కనపడలేదు. రోడ్ మీద వెళ్ళే కార్లన్నింటికీ నేను చేయి ఊపుతూ నిలుచున్నా. కొంత మంది నాకు చేతులు ఊపారు కూడా. ఈలోపల ప్రవీణ్ వేరే వైపు నుండి వచ్చాడు. గురునాధం ని కాలేజీ అయినతర్వాత ఇదే చూడడం. ప్రవీణ్ ని ఒకసారి నేను చెన్నై నుండి సూళ్ళూరుపేట వచ్చేటపుడు కలిసాను. మళ్ళీ కబుర్లు దొర్లాయి. మరి కాసేపయ్యాక మాధవ్ రెడ్డి డాలస్ నుండి దిగాడు, అతను కూడా లా ఫియెస్టా కి చేరుకున్నాడు. మాధవ్ కూడా మా ఊరి నుండే వచ్చాడు, కాలేజీ రోజుల్లో ఇతను హాస్టలులో ఉండేవాడు, మాకు ముఖ పరిచయం మాత్రమే. కాసేపు మాట్లాడుకుని అందరం చీకటి పడక ముందే స్మొకీస్ చేరుకోవాలని కళ్యాణ్ దగ్గరనుండి సెలవు తీసుకుని అట్లాంటా నుండి బయట పడ్డాము.
దేవ, మాధవ్ ఒక కారులో, నేను, ప్రవీణ్, శ్యాము, ఫిరోజ్, గురునాధం ఒక కారులో. సమయం నాలుగు దాటింది. ఆఫీసునుండి ఇంటికి వెళ్ళే వాళ్ళతో అట్లాంటా బిజీగా ఉంది. మాకు ఊరు దాటడానికి రెండు గంటల పైనే పట్టింది. మా కారుని ప్రవీణ్ నడుపుతున్నాడు, శ్యాము పక్కనే కూర్చుని దారి చెపుతున్నాడు. వీళ్ళిద్దరూ ఎమ్మెస్ రెడ్డి బిల్డింగులో ఉండేవాళ్ళు. వాళ్ళు కబుర్లలో పడి రోడ్ కూడా పట్టించుకోవడం మానేసారు. అసలే బిజీగా ఉన్న రోడ్డులో దారి తప్పి మళ్ళీ సరైన రోడ్ మీదకు వచ్చాము. మా వెనకాల మాధవ్ రెడ్డి, దేవ వస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుందామని శ్యాం వాళ్ళకి కాల్ చేసాడు. వాళ్ళు మా వెనక కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. అప్పటికే అందరూ అలిసిపోవడం వలన దారిలో స్టార్ బక్స్ కనిపిస్తే ఆగి కాఫీ తాగుదామని అనుకున్నాము. కాసేపయ్యాక మాకు స్టార్ బక్స్ కనిపించి ఆగాము. మేము దిగిన కాసేపటికి దేవ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి కాసేపు కాఫీ తాగి రిలాక్స్ అయ్యాము. చీకటి పడే లోగా స్మోకీస్ చేరుకోవాలని బయలుదేరాము.
అట్లాంటా నుండి దారి కొండ ప్రాంతం లాగా ఉంది. కాసేపయ్యాక మాకు ఫాల్ కలర్స్ కూడా కనపడడం మొదలుపెట్టింది. కారులో గురునాధం జోకులు ఆగకుండా పేలుతున్నాయి. దారిపొడుగునా ప్రకృతి సౌందర్యం చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్మోకీ పర్వతాలలోకి ప్రవేశించాము. జీపీఎస్ లో రోడ్ వంకరలు చూస్తుంటే మాకు మతి పోతుంది. శ్యాం అయితే కేకలు పెడుతూ ఉన్నాడు. ప్రవీణ్ కేకలు పట్టించుకోకుండా అంత పెద్ద ఎస్యూవీని అదిలిస్తూ తోలుతున్నాడు. మా కారునే కాక ముందు వారిని కూడా బెదరకొడుతున్నాడు. మా ముందు ఎవరో ముసలాయన అనుకుంటా, అతని ట్రక్కుని నెమ్మదిగా పోనిస్తూ ఉన్నాడు. ప్రవీణ్ అతని కారుకి బాగా దగ్గరగా పోనివ్వడం చూసి అతను రెండు, మూడు సార్లు హారన్ కూడా కొట్టాడు. మా అందరి ప్రార్ధనలు విని ప్రవీణ్ అతని ట్రక్కుని వెంబడించడం మానేసాడు. చీకటి పడ్డాక స్మోకీస్ చేరుకున్నాము. ఇక్కడ నుండి మేను ఉండబోయే ప్రదేశానికి జీపీఎస్ పని చేయదు. సెల్ ఫోన్లకి సిగ్నల్ లేదు. నేను ముందు జాగ్రత్తగా గూగుల్ మాప్ ప్రింట్ చేసి తీసుకువచ్చా. ఈలోపల నా ఫోనులో కొంత సిగ్నల్ వచ్చి గూగుల్ మాపు ఆధారంగా బయలుదేరాము. చాలా మలుపులు చీకటిలో కనపడడం లేదు. రెండు, మూడు సార్లు ముందు, వెనక్కి వచ్చి చివరికి సరైన దారిలో పడ్డాము. రోడ్ మీదకి కారు నిట్టనిలువుగా ఎక్కుతుంది. ముందు ఏముందో కనపడడం లేదు. ప్రవీణ్ కి ఏమీ కనపడడం లేదు, శ్యాం మాత్రం నేను చెపుతున్నాను కదా, వెళ్ళు అని అంటున్నాడు. అలా వెళ్ళాక మేముండబోయే ఇల్లు కనిపించింది. అంతకుముందే వాట్స్ ఆపులో ఇల్లు ఫోటోలు చూసి ఉన్నాము కాబట్టి నేరుగా లోపలకి వెళ్ళాము.
94లో కాలేజీ వదిలిన తర్వాత మళ్ళీ ఇపుడే చాలామందిని చూడడం. అందరినీ పలకరిస్తూ తింటూ, తాగుతూ శుక్రవారం రాత్రి చాలా ఉత్సాహంగా జరిగింది. నార్త్ కారోలీనా నుండి పురుషోత్తం చౌదరీ, నరేందర్ రెడ్డి, రఘురామి రెడ్డి, సంజీవ రెడ్డి వచ్చారు. న్యూజెర్సీ నుండి శ్రీనివాస్ పిట్టల, సుధీర్, శ్రీనివాస్ వచ్చారు. ఫిలడెల్ఫియా నుండి బాలాజీ, సత్య గణేష్, ప్రవీణ్, కృష్ణ వచ్చారు. ఎలెక్ట్రానిక్స్ లోని ప్రవీణ్ ని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. చికాగో నుండి గణేష్, సురేష్ వచ్చారు. వాషింగ్టన్ డీసీ నుండి జితేంద్ర ఒక్కడే వచ్చాడు. రమేష్ కుమార్, జగన్ రెడ్డి, వల్లభ్, వర్మ, సీవీ రాజు, రంగయ్య విమానంలో చేరుకున్నారు. రవి చేజర్ల వల్లభ్ అని అట్లాంటా నుండి తీసుకువచ్చాడు. వీరయ్య చౌదరీ ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి వచ్చాడు. కులదీప్ అట్లాంటా నుండి వర్మ, సీవీ రాజు, రంగయ్య, వీరయ్య చౌదరీ, జగన్ రెడ్డిని తీసుకువచ్చాడు. డెట్రాయిట్ నుండి ప్రభాకర్ రెడ్డి, పెంచల్ ప్రసాద్, రాజశేఖర్ కళ్ళెం, సుధాకర్, సుధీర్ కలిసి వచ్చారు. మేము అయిదు మంది, దేవా, మాధవులతో కలిపి మొత్తం ముప్పై ఏడు మందిమి అయ్యాము. ఉడిపి నుండి ఇద్దరితో ముప్పై తొమ్మిది మందిమి. అందరం కలిసిఉండడానికి ఎనిమిది బెడ్ రూములున్న ఒక ఇంటిని మూడు రోజులు రెంట్ చేసారు. ఒక్కొక్క గదిలో నలుగురు ఉండేలా, మిగిలిన వాళ్ళు సోఫాలలో సర్దుకునేలా ఏర్పాట్లు జరిగాయి. నార్త్ కారొలీనా కి చెందిన ఉడిపి హోటలు నుండి వంటవాడు వచ్చి మాకందరికీ నోరూరించేలా వంట చేసాడు. పలకరింపులు, పులకరింపులు, నోరూరించే వంటకాలు, ఉర్రూతలూగించే ద్రవాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. నిన్న రాత్రి కూడా సరిగా నిద్ర పోవకపోడంతో మాకు కేటాయించిన రూములో తొందరగానే పడుకున్నా.
అక్టోబరు 19, స్నేహితుల రోజు!
ఉదయం ఆరుకంతా శ్యాము, ఫిరోజ్ నిద్ర లేచారు. నాకు హాంగ్ ఓవరుతో నిద్ర లేక కాసేపు అలాగే దొర్లుతూ కూర్చున్నా.
నన్ను గమనించి గణేష్ "మాత్ర వేసుకుంటావా" అన్నాడు.
"అలాగే" అన్నాను.
బాలాజీ నాకు రెండు మాత్రలు ఇచ్చి "తిని వేసుకో" అన్నాడు.
ఉదయాన్నే ఉడిపి వారు దోసలు వెయ్యడం మొదలుపెట్టినపుడు నేను రెండు తినేసాను. కాఫీ కూడా తాగి రెండు మాత్రలు వేసుకున్నాక హాంగ్ ఓవర్ తగ్గడం మొదలయింది. బాత్ రూము కోసం అందరూ హాడావిడిగా తిరుగుతూ ఉన్నారు. నాకు అవకాశం దొరకగానే అన్నీ ముగించుకున్నాను. నిన్న రాత్రి మేము పడుకున్నాక ఒక చిన్న ఎలుగుబంటి వచ్చిందట, అది బయట పడి ఉన్న ట్రాష్ లోని బిరియానీ తినేసిందట. మళ్ళీ ఉదయం కూడా బిరియానీ కోసం వచ్చింది. ఈసారి అందరూ నిదానంగా దాని ఫోటోలు తీసుకున్నారు.
నా హాంగ్ ఓవర్ పూర్తిగా తగ్గిందా అని బాలాజీ తమాషాగా ఇలా అన్నాడు "నిన్నటి మందుకి నేనిచ్చిన మందు పని చేసిందా?".
నాకు మొదట అర్ధం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పేసరికి ట్యూబ్ లైటు వెలిగింది.
"బాగా పని చేసింది" అని చెప్పాను.
ఉదయాన్నే ఉడిపి వారు దోసలు వెయ్యడం మొదలుపెట్టినపుడు నేను రెండు తినేసాను. కాఫీ కూడా తాగి రెండు మాత్రలు వేసుకున్నాక హాంగ్ ఓవర్ తగ్గడం మొదలయింది. బాత్ రూము కోసం అందరూ హాడావిడిగా తిరుగుతూ ఉన్నారు. నాకు అవకాశం దొరకగానే అన్నీ ముగించుకున్నాను. నిన్న రాత్రి మేము పడుకున్నాక ఒక చిన్న ఎలుగుబంటి వచ్చిందట, అది బయట పడి ఉన్న ట్రాష్ లోని బిరియానీ తినేసిందట. మళ్ళీ ఉదయం కూడా బిరియానీ కోసం వచ్చింది. ఈసారి అందరూ నిదానంగా దాని ఫోటోలు తీసుకున్నారు.
నా హాంగ్ ఓవర్ పూర్తిగా తగ్గిందా అని బాలాజీ తమాషాగా ఇలా అన్నాడు "నిన్నటి మందుకి నేనిచ్చిన మందు పని చేసిందా?".
నాకు మొదట అర్ధం కాలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పేసరికి ట్యూబ్ లైటు వెలిగింది.
"బాగా పని చేసింది" అని చెప్పాను.
అందరి స్నానాలు, టిఫిన్లు అయ్యాక బయట చూసే ప్రదేశాలు ఏమున్నాయి అని గణేష్, నేను, బాలాజీ, పెంచల్, జగన్, ఫిరోజ్ కలిసి ఊరి మీదకు వెళ్ళాము. స్మోకీస్ కి వచ్చిన టూరిస్టులతో ఊరంతా చాలా సందడిగా ఉంది. విజిటర్స్ ప్లేస్ కి వెళ్ళి మేము చూడవలసిన వాటి గురించి వివరాలు కనుక్కుని, మాపులు తీసుకుని ఇంటికి తిరిగివచ్చాము. మా కోసం వేచి చూస్తున్న వారందరికీ ఈ విషయం చెప్పాము. కొంత మంది అపుడే కొండ కిందకు నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చారు. కొంతమంది షటిల్ ఆడుతూ ఉన్నారు. పురుష్ మాకు ప్రతి గంటకు ఒక కొత్త రకం స్వీట్ తీసుకువచ్చి తినిపిస్తూ ఉన్నాడు. అప్పటికి సమయం 11 దాటి ఉంటుంది. మధ్యాహ్నం బోజనం చేసి అందరం బయటకు వెళ్దామని అనుకున్నాము. అప్పటివరకు ఏమి చెయ్యాలి అని అలోచిస్తున్న సమయంలో నేను ఒక కథ చదువుతాను అని చెప్పాను. అందరూ బుద్దిగా హాలులో కూర్చుని నేను చదివిన, చెప్పిన సీజన్ బాయ్ కథ విన్నారు. కథ పూర్తి అయేలోపల భోజనాలు కూడా పూర్తి అయ్యాయి. అందరూ పొట్ట నిండా తిని ఇక బయటకు వెళ్దామని తీర్మానించుకున్నారు. వాషింగ్టన్ డీసీ నుండి శ్రీనివాస్ రేగేటి అక్కడకు చేరుకున్నాడు. రేగేటి వాషింగ్టన్ వైపు చాలా ప్రముఖ చాయాగ్రహుడు కూడా. మాకందరికీ స్మోకీస్ లోని ఫాల్స్ లో మంచి ఫోటో తీస్తానని చెప్పాడు. ఈలోపల ఎలెక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్, మెకానిచల్, సివిల్ బాచ్ విడివిడిగా ఫోటోలు తీసుకున్నారు. ఎలెక్ట్రానిక్స్ నుండి ఎక్కువ మంది ఉండడం విశేషం. తరువాత ఎలెక్ట్రికల్, మెక్ చివరలో సివిల్.
అంతకు ముందే అనుకున్నట్టు లారెల్ ఫాల్స్ కి అందరం బయలుదేరాము. ఈసారి కారులో మా అయిదు మందితో పాటూ రమేష్ కూడా ఎక్కాడు. మాకు దారి తెలియదు, మా ముందు టాల్ (రాజశేఖర్) కారు ఉంది, అతన్ని అనుసరిద్దామని అతని వెనక బయలుదేరాము. కొంచెం దూరం వెళ్ళగానే టాల్ మాకు దూరమయ్యాడు. మేము దారి తప్పి ఎక్కడకో వెళ్ళిపోయాము, వెనక్కి రావడానికి గంట పైనే పట్టింది. మళ్ళీ ఇంకోసారి దారి తప్పాము, మళ్ళీ ఇంకో గంట పైన పట్టింది వెనక్కి తిరిగి రావడానికి. ఈసారి విజిటర్ సెంటర్ కి వెళ్ళి అడ్రెస్ తీసుకుని బయలుదేరాము. తమాషాగా అది చాలా దగ్గరలోనే ఉంది. కారు పార్క్ చేసి ఫాల్స్ వైపు బయలుదేరాము. ఫాల్స్ కి చేరుకోవడానికి 1.4 మైళ్ళు నడవాలని అక్కడ చెప్పారు. కొండ పైకి కూడా ఎక్కాలి, మేము అనుకున్నట్ట్లు అది 1.4 మైళ్ళు కాకపోవచ్చు, ఇంకా ఎక్కువే ఉంటుందని అందరం నడవడం మొదలుపెట్టాము. రమేష్ కుమార్ అందరికంటే వెనక రావడం మొదలుపెట్టాడు. నేను, ప్రవీణ్ అతనికి తోడుగా వస్తున్నాము. అంతకుముందే పొట్ట నిండా తినడం వళ్ళ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాము. మాకు ఎదురుగా ఫాల్స్ నుండి తిరిగివస్తున్న వాళ్ళకి హలో చెపుతూ నడుస్తున్నాము. అపుడు ఇంకో తమాషా జరిగింది.
ప్రవీణ్ మాతో "ఇప్పటివరకు అందరూ కనపడుతున్నారు కానీ మనవాళ్ళు ఎక్కడా కనపడడం లేదు" అన్నాడు.
అంతే, అప్పటినుండి మనవాళ్ళే కనపడడం మొదలుపెట్టారు, వేరే వాళ్ళు కనపడడానికి పది నిముషాలపైనే పట్టింది. అప్పటివరకు కనపడని దేశీలు కుప్పలుగా కనపడ్డారు. ప్రవీణ్ నోటి మాట ఎంత శక్తివంతమైనదో మాకు అపుడు అర్థమయింది. ఇంటి నుండి బయలుదేరేముందు మా కాలేజీ రీయూనియన్ గుర్తు ఉండేటట్లు నరేందర్ అందరికీ చేపించిన టీ షర్టులు వేసుకున్నాము. ఫాల్స్ కి అందరూ ఆ చొక్కాలు వేసుకుని వెళ్ళాము.
మా ముందుగా వచ్చేవారిని "మాలాంటి చొక్కాలు మీకు ఫాల్సులో కనిపించాయా?" అని అడిగాము.
వాళ్ళు తలఊపి "చాలామంది ఉన్నారు" అన్నారు.
దానితో మాకు ఇంకొంచెం ఆనందం వేసి ఫాల్స్ చేరుకోగానే మా కాలేజీ మూక అక్కడ ఫోటోలు తీసుకుంటూ అల్లరి చేస్తూ ఉన్నారు. మేము కూడా వారిని చేరుకుని గ్రూప్ ఫోటో తీసుకున్నాము. రేగేటి అక్కడకి తన కమెరాతో వచ్చి అందరికీ గుర్తుండిపోయేలా ఒక్కొక్కరికి ఓపికగా ఫోటోస్ తీసాడు. అందరికీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ కి ఫోటోస్ దొరికాయి అని పెంచల్ ప్రసాద్ జోక్ చేసాడు. రేగేటి తర్వాత జితేంద్ర కూడా అందరికీ ఫోటోస్ తీయడం మొదలుపెట్టాడు. టాల్ ఒక చెట్టుని ఎత్తుతున్నట్టు ఫోటో తీసుకున్నాడు. దాన్ని రాజమౌళికి పంపితే బాహుబలి-3 తీస్తాడు అని వల్లభ్ జోక్ వేసాడు. చీకటి పడుతుండడంతో వెనక్కి రావడం మొదలుపెట్టాము.
మేము ఫాల్స్ వైపు వచ్చేటపుడు ఒకచోట ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా సెటప్ చేసి ఎదురుచూస్తూ ఉన్నాడు. మేము తిరిగివచ్చేటపుడు అతను ఫోటోస్ తీస్తూ కనిపించాడు. అతనికి ఎదురుగా రెండు పెద్ద కొండలు, వాటి మధ్యలో అస్తమించబోయే సూర్యుడు చాలా అద్భుతంగా కనిపించాడు.తిరిగివచ్చేటపుడు అందరూ తొందరగా దిగుతూ ఉన్నారు. నేనూ, ప్రవీణ్ మాట్లాడుకుంటూ వస్తున్నాము. ప్రవీణ్ తనకు ఫీనిక్స్ లో పరిచయమైన జంటల గురించి చెప్పాడు. చాలా వింతగా అనిపించింది. మన చుట్టూ ఎంతమంది విచిత్రమైన మనుషులు ఉంటున్నారో అని ఇద్దరం ఆశ్చర్యపడ్డాము. మా వెనక వస్తున్న శ్యాముకి మా మాటలు అర్థం కావడంలేదు. మేము చెప్పినా అతనికి అర్థం కాదని ఇద్దరం నవ్వుకున్నాము. అందరం పార్కింగ్ కి చేరుకుని ఎవరి కార్లలో వాళ్ళు ఎక్కి ఇంటికి చేరుకున్నాము.
ఫాల్సులో బాగా తిరగడం వలన అందరూ అలిసిపోయి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మాకోసం చేసిన మిరపకాయ బజ్జీలు, వడ, సాంబార్ తిని అందరూ శాంతించారు. పుల్లారెడ్డి హల్వా కూడా ఆరగించాము. ఇపుడే ఆసక్తికరమైన కార్యక్రమం ఒకటి మొదలైంది.
"మనందరం కాలేజీ వదిలిన రోజు నుడి ఇప్పటివరకు ఏమి చేసామో అందరికీ ఒకసారి చెప్పాలి" అని టాల్ అన్నాడు. అందరూ అర్థం కాని మొహం పెట్టడంతో టాల్ ముందు తనే చెప్పడం మొదలు పెట్టాడు. కాలేజీ అయిపొయ్యాక ఎలా ఎం.టెక్ చెయ్యడం, జాబులో చేరడం, అమెరికా రావడం చెప్పాడు. ఇలా అందరూ వాళ్ళ గురించి చెప్పుకోవడం మాకందరికీ బాగా నచ్చింది. ఒక్కొక్కరు వారి జీవితాల్లో ఎలా సెటిల్ అయ్యారో, దానికి ఎవరు సహాయ పడ్డారో చెపుతూ వచ్చారు. చాలామంది బట్టే, బద్రి, ప్రభాకర్, పురుష్ సహాయపడ్డారు అని చెప్పారు. ప్రతి ఒక్కరి కథ చాలా బాగా అనిపించింది. వారి, వారి కథలో వాళ్ళే హీరోలు! అందరూ చాలా కష్టపడి పైకొచ్చారని తెలిసి అందరికీ చాలా ఆనందమేసింది."మన బాచులో మనతో పాటూ 235 మంది చదువుకున్నారు. వారిలో నలభై మంది మాత్రమే ఈరోజు ఇక్కడ కలిసాము. మిగతా వారు ఎలా ఉన్నారు? వారిలో ఎంతమందికి సహాయం అవసరమో తెలుసుకోవాలని" గణేష్ అన్నాడు. అందరికీ గణేష్ చెప్పిన మాట బాగా అనిపించింది. తమ బాచ్ వారు ఎలా ఉన్నారో ఒకసారి కనుక్కుని వారికి సహాయం అవసరమైతే చెయ్యాలని అనుకున్నాము. మాతో పాటూ చదివి మమ్మల్ని వదిలి పైలోకాలకు వెళ్ళిన స్నేహితులని తలుచుకున్నాము. వెంకటేశ్వర్లు కుటుంబానికి సహాయం చెయ్యాలని కూడా అనుకున్నాము. ఇప్పటివరకు అందరూ కలిసే ఉన్నాము. ఇక మీదట కూడా కలిసే ఉండాలని బట్టే అన్నాడు. చివరగా అందరం కలిసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఫిరోజ్, జితేంద్రని అందరూ పొగిడారు.
చివరగా షాంపేన్ పార్టీ జరిగింది. ఎవరికీ ఇంటికి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాలి కాబట్టి బయలుదేరుతున్నారు. నాలుగు షాంపేన్ బాటిల్స్ ని ఓపన్ చేసి అందరూ ప్రసాదంలా తాగారు.
"షాంపేన్ ఎవరి మీదా పొయ్యద్దు" అని బట్టే చెప్పాడు.
కానీ ప్రభాకర్ అందరి మీద పోసి రచ్చ చేసాడు. చల్లగాలిలో ఇంకా చల్లగా షాంపేన్ పడడం సరదాగా అనిపించింది. అప్పటికే అర్థరాత్రి దాటి కొన్ని గంటలయింది. ఉదయాన్నే వెళ్ళేవారికి ఆరాత్రే టాటాలు చెప్పి మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండాలని అందరం అనుకున్నాము. మేము ఆదివారం సాయంత్రం అట్లాంటా నుండి విమానం ఎక్కాలి, అంటే స్మోకీస్ నుండి మేము ఉదయం తొందరగానే బయలుదేరాలని అప్పటికప్పుడు పడుకున్నాము.
అక్టోబరు 19, టాటా...బై..బై...
ఉదయాన్నే లేచేసరికి చాలా మంది బయలుదేరి వెళ్ళిపోయారు. సియటిల్ వెళ్ళాల్సిన జగన్ మాతోపాటూ అట్లాంటాకి వస్తానన్నాడు. మా వాళ్ళందరూ నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకున్నాము. ఉడిపి వారి టిఫిన్లు కూడా తయారయ్యాయి. కాఫీలు, టిఫిన్లు తిని లగేజీ సర్దుకుని కారులో పెట్టుకున్నాము. డూరం డ్రైవ్ చేసే వాళ్ళు కూడా బయలుదేరారు. ఉడిపి వాళ్ళు కూడా వంట సామాను మొత్తం వారి వానులోకి ఎక్కించారు. మళ్ళీ ఫోటోల కార్యక్రమం మొదలయింది.
ఎవరికీ ఇంటికి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళాకి కాబట్టి బయలుదేరుతున్నారు.
"లేటు అయ్యేకొద్దీ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది, పదండి, పదండి" అని కులదీప్ అందరినీ కదిలించాడు.
అందరికీ చివరి సారిగా టాటా చెప్పి ఆరుమందిమి అట్లాంటా వైపు కదిలాము. కారు రోడ్ మీద పడడంతో మా కబుర్లు మళ్ళీ మొదలయ్యాయి. ప్రవీణ్ ప్రస్తుతం ఫీనిక్సులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి శ్యాం అతన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టాడు. డాలసులో కూడా ఇలాంటి వ్యాపారం చెయ్యమని ప్రవీణ్ ని ప్రోత్సహించాము. మాటల్లో గురునాధం కుటుంబం శ్రీకాళహస్తికి పక్కనే ఉంటారని తెలిసింది. గురునాధం వాళ్ళ ఊరులో పిల్లలని చదువులో ప్రోత్సహించడం గురించి చెప్పాడు. మంచి పని చేస్తున్నందుకు అతన్ని అభినందించాము. డాలసులో శ్యాం, నేను, ఫిరోజ్, మంజునాధ్ ఎలా కలిసిన విషయం అందరికీ చెప్పాము. కాలేజీ అయిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలిసుతామని ఎపుడూ అనుకోలేదు అని శ్యాం అన్నాడు. ఇదే విషయాన్ని అతను చాలా సార్లు చెప్పాడు. మాకూ అలాగే అనిపించింది. స్మోకీస్ కొండ దిగేముందు ఆ కొండలో ఎత్తైన ప్రదేశానికి వెళ్దామని ఫిరొజ్ చెప్పగా ప్రవీణ్ కారుని అటు కదిలించాడు. ఒక పది మైళ్ళు లోపలకి వెళ్ళగానే చాలా మంది పార్కింగ్ కోసం తిరుగుతూ కనిపించారు. మేము ముందే దిగేసి కొన్ని ఫోటోలు దిగాము. ఆ ప్రదేశం నుండి చూస్తే చాలా కొండలు కనిపించాయిల్. వాటి పైన రంగులు మారుతున్న ఆకులు, చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. కొండ పైన ప్రాంతం కాబట్టీ బాగా చలిగా కూడా ఉంది. తొందరగానే ఈ కార్యక్రమం ముగించి మళ్ళీ రోడ్డెక్కాము. స్మోకీస్ దిగిన కాసేపటికి అందరం చిన్న బ్రేక్ తీసుకున్నాము. పెట్రోల్ కొట్టించి కాఫీలు తాగి బాత్ రూం వెళ్ళి వచ్చాము. ఈ ప్రాంతంలో వేరుశనగలు ఉడకబెట్టి అమ్ముతారట. ఆ గాస్ స్టేషనులో పల్లీలు ఖాళీగా ఉన్నాయి. జగన్ అందరికీ కొన్ని కాల్చిన చనక్కాయలు కొనిచ్చాడు. వాటిని తింటూ కబుర్లు మాట్లాడుతూ అట్లాంటా చేరుకున్నాము.
ముందు జగన్ ని దించి మేము కారులో మరి కొంత గాస్ కొట్టించి కారు రిటర్న్ చేసాము. అక్కడ నుండి ట్రైన్ ఎక్కి ఏర్ పోర్ట్ చేరుకున్నాము. ఈసారి మేము కారులో వచ్చేటపుడు ఆన్ లైనులో చెక్ ఇన్ చేసాము, అందరి దగ్గర ఈమెయిలు ఉంది కానీ ప్రింట్ ఔట్ లేదు. సెక్యూరిటీ వాడు మమ్మల్ని ప్రింట్ ఔట్ తీసుకురమ్మన్నాడు. మేము మళ్ళీ మా ఏర్లైన్స్ దగ్గరకి వెళ్ళి ప్రింట్ ఔట్ తెచ్చుకున్నాము. ఆదివారం సాయంత్రం కాబట్టి ఏర్ పోర్ట్ బాగా హడావిడిగా ఉంది. మేము ప్రింట్ ఔట్ తెచ్చేలోపల గురునాధం, ప్రవీణ్ ముందు వెళ్ళిపోయారు. నేను, శ్యాం, ఫిరోజ్ వెనక చేరాము. ఫిరోజ్ వెనక మేము క్యూలో వస్తూ ఉన్నాము. ఒకచోట ఫిరోజ్ ఇంకో లైనులో వెళ్ళిపోయాడు. నేను, శ్యాం ఇంకో లైనులో వస్తున్నాము. ఈలోపల శ్యాం కి ప్రవీణ్ ఫోన్ చేసాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఈలోపల మా సెక్యూరిటీ పూర్తి అయింది. అయిదుమంది కలిసి డాలస్ వెళ్ళే విమానం దగ్గరకి వెళ్ళాము. మేము స్మోకీసులో బయలుదేరినప్పటి నుండి ఏమీ తినలేదు. అట్లాంటాలో తిందామనుకున్నాము కానీ సమయం లేక తినలేదు. సెక్యూరిటీ అయ్యాక అక్కడ ఉన్న ఒక షాపులో నేను ట్యూనా సాండ్ విచ్, ఫిరోజ్ వెజీ రాప్ తీసుకున్నాడు. శ్యాం "ఆకలి లేదు" అని ఏమీ తీసుకోలేదు. ప్రవీణ్, గురునాధం విమానం మేము వెళ్ళాక ఉంది. వాళ్ళు "మేము మళ్ళీ తింటాము" అని చెప్పారు. బోర్డింగ్ కి ముందే నేను ట్యూనా తినేసా. ఫిరోజ్ "రాప్ అంత బాగాలేదు" అని చెప్పాడు.
*** ఇక్కడ జరిగిన విషయాన్ని సెన్సార్ వారు తీసివేయబడినది. ***
ఈలోపల మా సెక్యూరిటీ పూర్తి అయింది. అయిదుమంది కలిసి డాలస్ వెళ్ళే విమానం దగ్గరకి వెళ్ళాము. మేము స్మోకీసులో బయలుదేరినప్పటి నుండి ఏమీ తినలేదు. అట్లాంటాలో తిందామనుకున్నాము కానీ సమయం లేక తినలేదు. సెక్యూరిటీ అయ్యాక అక్కడ ఉన్న ఒక షాపులో నేను ట్యూనా సాండ్ విచ్, ఫిరోజ్ వెజీ రాప్ తీసుకున్నాడు. శ్యాం "ఆకలి లేదు" అని ఏమీ తీసుకోలేదు. ప్రవీణ్, గురునాధం విమానం మేము వెళ్ళాక ఉంది. వాళ్ళు "మేము మళ్ళీ తింటాము" అని చెప్పారు. బోర్డింగ్ కి ముందే నేను ట్యూనా తినేసా. ఫిరోజ్ "రాప్ అంత బాగాలేదు" అని చెప్పాడు.
మా బోర్డింగ్ మొదలవగానే మేము ముగ్గురం ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని బండెక్కాము. మేము డాలస్ నుండి వచ్చినపుడు మాతొ పాటూ వచ్చిన కొంతమంది మాలాగే తిరిగి డాలస్ వెళ్ళడం గమనించాము. ఒక తల్లీ, కూతురు, ముగ్గురు ఆడవాళ్ళు, ఒక భార్య, భర్త, వారి అబ్బాయి. క్రితం సారి కూడా సరిగ్గా లాండింగ్ అయే సమయానికి పిల్లవాడిని ఎత్తుకుని తండ్రి బయట నిలబడ్డాడు. తల్లీ, కూతురు మాకు ముందే కూర్చుని ఉన్నారు, ఇద్దరూ కన్నడలో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
శ్యాం కిటికీ పక్క సీటులో కూర్చుని కునుకు వేసాడు. ఫిరోజ్ వాకాడు కాలేజీ విశేషాలు చెపుతూ కూర్చున్నాడు. నేను వింటూ ఉన్నాను. కాలేజీలో ఇపుడు మంచి లెక్చరర్లు లేరనీ, ఉన్న వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వడం లేదనీ, లాబుల్లో విధ్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుకుంటున్నారనీ చెప్పాడు. క్రితం సారి ఇంటికి వెళ్ళినపుడు పిల్లలతో మాట్లాడానని, వాళ్ళకి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నానని చెప్పాడు. బయటి వాతావరణం గురించి వాళ్ళకి మనం చెప్పాలని అన్నాడు. మాటల్లోనే డాలస్ కూడా వచ్చేసింది. అట్లాంటాలో ఏర్ పోర్ట్ నుండి బయటకు రావడానికి మాకు పదిహేను నిముషాలు పైనే పట్టింది. డాలసులో అయిదు నిముషాల లోపలే రోడ్ మీదకు వచ్చేసాము. అప్పటికే పార్కింగ్ కి తీసుకు వెళ్ళే షటిల్ రెడీగా ఉంది. ముగ్గురం ఎక్కాము. మా ముందు ఒక పడుచు జంట కూర్చుని ఉన్నారు. ఇద్దరూ కంట్రీ సైడ్ నుండి వచ్చినట్లున్నారు. అమ్మాయి ఆరడుగుల పొడుగుంది, పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంది. షటిల్ మా కారు వద్దకు వచ్చి ఆపాక మా లగేజ్ తీసుకుని షటిల్ డ్రైవరు కారు డిక్కీలో పెట్టాడు. అక్కడ నుండి ఒక అరగంటలో మా ఇంటికి చేరుకున్నాము. నా లగేజీ దింపి ఫిరోజ్ కి, శ్యాం కి టాటా చెప్పి ఇంట్లోకి నడిచాను. అప్పటికే భోజనాలు కూడా అయిపోయింది కాబట్టి పడక ఎక్కేసాను. ఒక అరగంటకి శ్యాం, ఫిరోజ్ కూడా ఇంటికి చేరుకున్నారు. ఇంకో రెండు గంటలకి ప్రవీణ్ కూడా ఫోన్ చేసి "మేము కూడా ఫీనిక్స్ చేరుకున్నాం. మా విమానం లేట్ అయింది" అని చెప్పాడు. అలా మా వాకాడు కాలేజీ రీయూనియన్ సుఖాంతం అయింది.
No comments:
Post a Comment