Sunday, December 27, 2015

కొలరాడో యాత్ర విశేషాలు - 8


కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగం
మీరు చదవకపోతే ఇక్కడ 123 , 4567 మొదలుపెట్టచ్చు.



ఏడవ రోజు, శుక్రవారం జూలై 3, టుకుంకారి

మా ప్రయాణంలో మొదటి రోజు లాగే ఈరోజు కూడా మాకు అయిదు వందల మైళ్ళ ప్రయాణం ఉంది. ఉదయాన్నే నిదానంగా నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకుని హోటలు వాడి అల్పాహారం తిన్నాము. వినయ్ వాళ్ళు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు. అలవాటు ప్రకారం ఫరూఖ్ అందరి బైకులు చెక్ చేసాడు, కృష్ణ బైకు టైరు బాగా పాడయ్యింది. డాలస్ వరకు ఆ టైరుతో వెళ్ళడం కష్టం. ఆమరిల్లో వెళ్ళగానే టైరు మార్చుకుందామనుకున్నాము.  కొన్ని గంటలకి టెక్సాస్ లోని అమరిల్లో చేరుకున్నాము. పడమర నుండి వచ్చేటపుడు టెక్సాసులో ఇదే మనకి మొదట కనిపించే పెద్ద ఊరు. మేము అనుకున్న షాపు వాడు ఆరోజు తెరవలేదు. కొంతమందికి కాల్ చేసి అక్కడకి వెళ్ళాము. అతను టైరు తియ్యగలను కానీ, అది బాగా అలైన్ అయిందో, లేదో తెలిపే పరికరం తన దగ్గర లేదన్నాడు. కృష్ణ బైకు బీ.ఎం.డబల్యూ, వీటికి పరికరాలు అందరి దగ్గరా ఉండవు. చివరికి ఒక యమహా డీలరు దగ్గరకెళ్ళి రిపేరు చేపించాము. వాడు ఒక రెండు, మూడు గంటల్లో రిపేరు చేసాడు. ఈలోపల మేము షోరూములో కొత్త బైకులు చూస్తూ కబుర్లు చెప్పుకున్నాము. బైకి రెడీ అయ్యాక కృష్ణ ఒక రెండు సార్లు, బైకు నడిపి అంతా బాగానే ఉంది అని చెప్పింది. అక్కడ నుండి ఒక థాయ్ రెస్టారెంటుకి వెళ్ళి తిన్నాము.



మంచి ఎండ, చల్లని నీళ్ళు బైకులో పెట్టుకుని దూరాభారం బయలుదేరాము. సాయం సమయలేళ కారు మబ్బులు కమ్ముకోవడం మొదలుపెట్టాయి. హైవే పక్కన ఆగి నేను తప్ప మిగతా ముగ్గురూ వాన డ్రెస్ వేసుకున్నారు. వాన కాసేపయ్యేసరికి బాగా పెద్దదయ్యింది. హైవే దిగి దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర బైకులు పార్కింగ్ చేసి పరిగెత్తుతూ గోడ చాటుకు వెళ్ళాము. అక్కడ ఒక ఇద్దరు జంటలు సిగరెట్టు కాలుస్తూ మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళతో సరదాగా మాటలు కలిపాము. వర్షం ఎంతకీ తగ్గకపోయేసరికి వాళ్ళు మమ్మల్ని హాలు లోపలకి ఆహ్వానించారు. మేము మొహమాటపడుతూ లోపలకి వెళ్ళాము. అది ఒక ఫామిలీ రియూనియన్. ప్రతి రెండు సంవత్సరాలకీ వాళ్ళ కుటుంబంలో అందరూ అమెరికా నలుమూలల నుండి అక్కడకి చేరుకుంటారట. వాళ్ళు ఆ వారంతం అంతా ఒక చోట కలిసి కాలం గడుపుతారు. వాళ్ళలో రెండు సంవత్సరాల పిల్లల నుండి ఎనభై ఏళ్ళ వరకు ఉన్నారు. వాన పడుతున్నపుడు తలుపు సందుల నుండి నీళ్ళు లోపలకి వస్తూ ఉండింది. ఒక ఇద్దరు,ముగ్గురు వాటిని తుడుస్తూ నేల ఆరబెడుతూ ఉన్నారు.


"వర్షం ఇటువైపే వస్తుంది, ఇంకొక అరంగటపైనే ఈ వర్షం ఉంటుంది" అని ఒకతను తన ఫోనులో వాతావరణ సూచనలు, ఆ వర్షం కేంద్రీకృతమయిన ప్రదేశం మాకు చూపించాడు.

"మీరు వర్షం అయ్యేంతవరకు మాతోనే ఉండచ్చు. మా భోజనవేళ కూడా అయింది, మాతో పాటూ కొంత తినండి" అని అతని భార్య మమ్మల్ని పిలిచింది.


మొదట "పరవాలేదు లెండి" అన్నాము.


వాళ్ళ కుటుంబంలో పెద్దతను మళ్ళీ మాదగ్గరకు వచ్చి ఇంకోసారి అభ్యర్ధించారు. వారి మర్యాద చూసి మేమందరం ఇక బాగుండదని వారితో పాటూ కలిసి భోజనం చేసాము. వారిలో కొందరు ఫ్లోరిడా నుండి వచ్చారు. కొందరు న్యూజెర్సీ నుండి వచ్చారు. ఒక కుటుంబం శాన్ ఆంటోనియోకి దగ్గరలో ఉన్న హిల్ కంట్రీ నుండి వచ్చారు. మాకందరికీ హిల్ కంట్రీ బాగా ఇష్టం, ఒక రెండు,మూడు సార్లు అక్కడకి వెళ్ళి వచ్చాము. వారితో మా అనుభవాలు పంచుకున్నాము. ఒక పెద్ద కుటుంబం ఒక చోట చేరితే ఎలా సరదా, సరసాలు ఉంటాయో అవన్నీ అక్కడ మేము చూసాము. మన ఊరిలో ఒక పెళ్ళికి వచ్చిన అనుభూతి మాకు కలిగింది. ప్రతి రెండు సంవత్సరాలకి మేము ఇక్కడే కలుస్తాము, మీరు తప్పకుండా రండి అని మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించారు. వారందరితో ఒక ఫోటో తీసుకుని వారి దగ్గర సెలవు తీసుకుని రోడ్డెక్కాము.

మా ప్రయాణంలో మొదట ఒంటరిగా ఉన్న అమెరికన్ కనపడడం, చివరగా అమెరికా నలుమూలల నుండి కుటుంబీకులని కలవాలని వచ్చిన వారిని చూడడం కాకతాళీయం! 


అక్కడ నుండి డాలస్ ఒక రెండు,మూడు గంటలు మాత్రమే! వెర్నాన్ లో మాకు లభించిన మర్యాదలను నెమరు వేసుకుంటూ ఫోర్ట్ వర్త్ చేరుకున్నాము. అక్కడ చివరి సారిగా పెట్రోల్ కొట్టించి ఫరూఖ్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాడు. దేవేందర్, కృష్ణలతో పాటూ కలిసి నేను డాలస్ వరకు వచ్చాను. మేము డాలస్ చేరే సమయానికి రాత్రి ఇంచుమించు తొమ్మిది అయింది. పక్కరోజు అమెరికా స్వాతంత్ర దినోత్సవం, డాలసులో ఆ సమయంలో టపాసులు కాలుస్తూ ఉన్నారు. డౌన్ టౌనులో పైకి ఎగురుతున్న బాణాసంచా ఆకాశంలో తళతళా మెరుస్తూ మాకు స్వాగతం పలికింది!

3 comments:

విన్నకోట నరసింహా రావు said...

Continental Divide కి దగ్గరగా వెళ్ళొచ్చారన్నమాట, అభినందనలు. బాగుంది మీ సాహసయాత్ర. అలాగే దారిలో Rednecks, ఇతర బైకర్స్(పిల్లిగడ్డాల తెల్ల బైకర్స్) లతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా (వాళ్లల్లో కొంతమంది రఫ్ గా ఉంటారని లోకాభిప్రాయం; అనుభవంలేని మాలాంటి వారి అపోహే కావచ్చు) యాత్ర ముగించినందులకు అభినందనలు.

శ్రీ said...

బైకర్స్ రోడ్ మీద ఒకరికొకరు ఎదురుపడినపుడు గాలిలో కరచాలనం చేస్తారు. ఎదుటివాడు ఎవరైనాసరే, సాటి బైకర్ కనిపిస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు. తమ అనుభవాలను, బైకు బాగోగులు పంచుకుంటారు.

మనుషుల్లో మంచి,చెడు ఉన్నట్లే బైకర్లలో కూడా ఉంటారు.

నా ఇంకొక యాత్రలో బైకు టైరు పంక్చర్ అయినపుడు ఒకతను మాకు చాలా సహాయం చేసాడు.

ఇంకొకసారి పెట్రోలు అయిపోయి నా బైకు ఆగిపోతే ఒకతను దగ్గర ఉండి పెట్రోలు బంక్ దాకా తీసుకువెళ్ళాడు.

Mahesh said...

CHALAA BAAGA RAASARU.

ENJOY READING.