Saturday, December 26, 2015

కొలరాడో యాత్ర విశేషాలు -7


కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగం
మీరు చదవకపోతే ఇక్కడ 123 , 45, 6 మొదలుపెట్టచ్చు.


ఆరవ రోజు, గురువారం జూలై 2, ఆరే



ఇది కొలరాడోలో మాకు చివరి రోజు. ఈరోజు కూడా నిన్న వెళ్ళిన మిలియన్ డాలర్ హైవేలోనే వెళ్ళాలి. కేకే కుటుంబముతో కొంచెం లేటుగా వస్తానన్నాడు. నా స్లీపింగ్ బాగ్ కేకే ట్రక్కులో పెట్టేసి ఆ నలుగురితో నేను కలిసి అల్పాహారం ముగించాము. నిన్న అన్ని ఫోటోలు తీసుకున్నాం కాబట్టి ఆగకుండా వెళ్దామనుకున్నాము. నిన్న కొద్దిగా గాభరా పడ్డ మేము ఈసారి చాలా అలవోకగా మిలియన్ డాలరు హైవే దాటేసాము. కొన్ని గంటలలోనే డ్యూరాంగో చేరుకున్నాము. ఫరూఖ్ తో ఫోను కలిపితే "మీరు మెక్ డోనాల్డ్స్ కి వెళ్ళండి. నేను అక్కడ కలుస్తాను" అని చెప్పాడు. మేము వెళ్ళిన కొన్ని నిముషాలకి ఫారుక్ చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ కొంచెం ఎంగిలి పడ్డాము. ఫరూఖ్ నిన్న అతని బంధువుని కలిసానని చెప్పాడు. డ్యూరాంగోలో నిన్న పెద్ద వర్షం పడిందట. టెంట్ నుండి బయటకు రాకుండా పడుకున్నా అన్నాడు. 


జూలై నాలుగు వినయ్, రూపి పెళ్ళి రోజట. ఈరోజే మేము ఎక్కువ దూరం వెళ్ళి రపు తొందరగా ఇళ్ళు చేరుకుంటాము అన్నారు. నేను, ఫరూఖ్, దేవేందర్, కృష్ణ న్యూ మెక్సికో మీదుగా వెళ్దామని నిర్ణయించుకున్నాము. వినయ్ హైవే మీద వెళ్దామని బయలుదేరారు. కేకే మా మాటలు విని నేను హైవే మీద వెళ్తానని చెప్పాడు. కాకపోతే ఈరోజు రాత్రి మేము ఆగినపుడు నాకు స్లీపింగ్ బాగ్ అవసరం అవుతుంది. నేనేమో, కేకే మాతోనే ఉంటాడని దాన్ని ట్రక్కులో పెట్టేసాను. కేకేని మా దగ్గర ఆగి నా బాగ్ ఇవ్వమని చెప్పాము. అతను ఒక అరగంటలో మా దగ్గరకి వచ్చి స్లీపింగ్ బాగు ఇచ్చి డాలస్ వైపు బయలుదేరాడు. అప్పటివరకు కలిసి ప్రయాణించిన మేమందరం ఈరోజు మాత్రం మూడుగా విడిపోయాము. స్లీపింగ్ బాగుని దేవేందర్ పెద్ద బాగులో వేసేసి మేము కూడా కొలరాడో జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ బయలుదేరాము.


డ్యూరాంగో కూడా కొంత వరకు కొండ ప్రాంతమే, దారి కూడా వంకరటింకరగా ఉండి మాకు బాగా నచ్చింది. రోడ్ కూడా ప్రకృతి లాంటిది, ఎన్ని వంపులుంటే అంత సొంపుగా ఉంటుంది. వారాంతం చేరుకుంటూ ఉన్నాము, అలాగే జూలై నాలుగు పెద్ద పండగ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. రెండు, మూడు గంటలు ప్రయాణించి న్యూ మెక్సికో రాష్ట్ర సరిహద్దుకి చేరుకున్నాము. అక్కడ సబ్వేలో భోజనం ముగించి రోడ్ మీద పడ్డాము. ఇక మాకు ఎక్కడా ఆగే పని లేదు కాబట్టి మధ్యలో పెట్రోల్ కొట్టించడం, నీళ్ళు తాగడం మళ్ళీ రోడ్ మీద ఉరకలు వెయ్యడం ఇదే పని. 

ఒక చోట పెట్రోల్ కోసం ఆపినపుడు ఒక ట్రక్ అతను "ఎక్కడ నుండి వస్తున్నారు" అని అడిగాడు. 

"కొలరాడో నుండి వస్తున్నాము, టెక్సాస్ తిరిగి వెళ్తున్నాము" అని చెప్పాము. 

అతను చాలా సంవత్సరాల ముందు కొలరాడో వెళ్ళాడట. ప్రస్తుతం అతని బైకు గరాజ్ లో ఖాళీగా ఉంది. మా అబ్బాయి పోలీసు, రోడ్ మీద బైకులో ఎక్కువ తిరగకు అని చెప్తున్నాడట. మమ్మల్ని చూసి మళ్ళీ బైకు బయటకి తీస్తానని చెప్పాడు. 





కొలరాడోలో కొండలంతా చిక్కని చెట్లతో పచ్చగా ఉన్నాయి. న్యూ మెక్సికోలో మాత్రం ఎర్రని కొండలు! ఆ కొండలమీద ఎండ పడుతూ ఉంటే ఎర్ర కొండలు మెరుస్తూ చూడడానికి చాలా బాగున్నాయి. సాయంత్ర వేళకి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయింది. ఫరూఖ్, దేవేందర్, కృష్ణ వాన డ్రెస్ వేసుకున్నారు. ఈసారి వాన ఎక్కువసేపు లేదు, కాసేపు మాత్రమే మమ్మల్ని తడిపి వెళ్ళిపోయింది. సాంటా ఫే అన్న ఊరుకి అనుకున్న సమయానికంటే ముందే చేరుకున్నాము. అప్పటికి ఇంకా చీకటి పడలేదు, ఇంకో రెండు గంటలు మేము వెళ్ళచ్చు అని అందరూ చెప్పాక తూర్పు వైపు ఉరికించాము.


కొద్దిగా చీకటి పడ్డాక పెట్రోల్ కోసం దారిలో ఉన్న గాస్ స్టేషన్ కి వెళ్ళాము. ఆశ్చర్యం! అదే చోట వినయ్, రూపి కనిపించారు. వాళ్ళు వానలో ఇరుక్కుపోయి కొంత వెనకపడ్డారట. అనుకోకుండా వాళ్ళని మళ్ళీ కలవడం అందరికీ చాలా సంతోషాన్నిచ్చింది. కలిసి కబుర్లు చెప్పుకున్నాము. మేము ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుని అక్కడే బస చేద్దామనుకున్నాము. వినయ్ ఇంకొంత దూరం వెళ్దామని అనుకుంటున్నాడు, మేము కూడా వస్తామని అతని వెనుక బయలుదేరాము.


ఈసారి బాగా చీకటి పడింది. అందరూ హైబీములో స్పీడుగా వెళ్తున్నాము. అక్కడకి దగ్గరలో ఉన్న టుకుంకారి అన్న ఊరుకి చేరుకుని అక్కడే హోటల్ తీసుకుందామనుకున్నాము. కొలరాడో వరకు అయిదు రోజులూ మేము ఎక్కడ ఉండాలో తెలుసు కాబట్టి రిజర్వేషన్స్ చేసుకున్నాము. తిరిగి వచ్చే సమయంలో సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా దారిలోనే ఆగి హోటలులో చేరిపోవడమే ఉత్తమం. టుకుంకారి చేరి గాస్ స్టేషన్ కిందకి వెళ్ళగానే కుండపోతగా వర్షం. మా మీద చుక్క కూడా పడక ముందే మేము షెల్టర్ చేరుకున్నాము. బంకు వెనకే చాలా హోటల్లున్నాయి. ఒక హోటలులో బేరం కుదిరి అందరం అక్కడ దిగేసాము. మా బైకులు కూడా లాబీలోనే పార్కు చేసుకోవడానికి హోటలు వాడు అనుమతి ఇచ్చాడు. ఆ రాత్రి హోటలుకే భోజనం తెప్పించుకుని సురాపానం పొంగించి కబుర్లు చెప్పుకున్నాము.
అంతకు ముందు సురాపానం కోసం పక్కనే ఉన్న షాపుకి వెళ్ళాము.


“మీ ఊరిలో వాల్మార్ట్ లేదు, ఎందుకని” ప్రశ్నిస్తే “ఈ ఊరిలో ఉన్న ఆ నాలుగైదు హోటళ్ళ వల్లే మాకు వ్యాపారం. అవి లేకపోతే మాకు గిట్టుబాటు ఉండదు. వాల్మార్ట్ కూడా అందుకే రాలేదు” అని షాపు వాడు చెప్పాడు.


కేకే మాకు ఒక వంద మైళ్ళ దూరం ముందు ఉన్నాడు. మరి కొంత దూరం వెళ్ళి హోటలు తీసుకుంటానని చెప్పాడు. వినయ్, రూపి రేపు ఉదయం తొందరగా లేచి సాయంత్రం లోపల డాలస్ చేరుకుంటామని చెప్పారు. కేకే రేపు మధ్యాహ్నానికి డాలస్ చేరిపోవచ్చు. మిగిలిన వాళ్ళం నిదానంగా వెళ్దామని అనుకున్నాము.

No comments: