Monday, June 7, 2010

Postmen in the Mountains

అన్ని సినిమాలు చూసేస్తుంటాం, అపుడపుడూ ఇటువంటివి కూడా కలిసి చూసి కాసేపు చర్చించుకుందామన్న తలంపుతో కొందరం స్నేహితులం కలిసి ఒక మూవీ క్లబ్ పెట్టుకున్నాం. వీలైయితే ప్రతి గురువారం ఒక ఇంట్లో చేరి ఒక మంచి సినిమా చూడడం, చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవడం.


ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చైనీస్ సినిమా చూడడం జరిగింది. చైనాలో ఒక మారు మూల కొండ ప్రాంతంలో ఒక పోస్ట్ మాన్ పని చేస్తూ ఉంటాడు. తండ్రితో పాటు ఒక కుక్క కూడా కొండలు తిరుగుతూ ఉత్తరాలు అందించడంలో సహాయం చేస్తూ ఉంటుంది. తండ్రికి
వయసైపోయి కొండలు నడవలేక తన వృత్తిని కొడుక్కి అప్పజెప్తాడు. కొడుకు ఉత్తరాలు అందించే పనిలో తండ్రి సహాయం అవసరం అవుతుంది. కొడుకు, తండ్రి, కుక్క ఉదయాన్నే ప్రయాణం కడుతారు, ఈ ప్రయాణం లో కొడుక్కి తండ్రి కొత్తగా పరిచయమవుతాడు,
అలాగే తండ్రికి కూడా ఉద్యోగ భాద్యతలో కొడుక్కి దూరంగా ఉండడం వల్ల కొడుకు కొత్తగా కనిపిస్తాడు.


సినిమా ఒక అద్భుత కావ్యం లాగా నడుస్తుంది. కొండలు, వాగుల మద్యలో ప్రయాణం సాగుతూ తండ్రి,కొడుకుల పాత్రల్లో మనల్ని చూసుకోకుండా ఉండలేము. ఎదో పొట్ట కోసం నాలుగు రాళ్ళు అనుకోకుండా తన పని మీద తండ్రికి ఉన్న అభిమానం,అంకిత భావం కొడుక్కి భాద్యత గుర్తు చేపించడం, నలుగురిలో తండ్రికి ఉన్న విలువలు చూసి అతని మీద అభిమానం కలగడం చాలా బాగా చూపించారు. ఈ ప్రయాణంలో కొడుక్కి ఒక అందమయిన యువతి పరిచయం అవుతుంది, ఇది దగ్గరగా చూసిన తండ్రికి తన ప్రేమ, పెళ్ళి, పిల్లవాడు పుట్టడం ఇవన్నీ గుర్తుకు రావడం చాలా బాగా చూపించారు. తండ్రి పాత్రలో టెన్ రుజున్ అద్భుతంగా నటించాడు, అతని కళ్ళలోనే చాలా లోతయిన భావాలు మనల్ని కదిలిస్తాయి.


సినిమాకి చాలా మంచి అవార్డులు కూడా వచ్చాయట, వీలుంటే వీకీలో చూడండి. సినిమా చూసాక మంచి అనుభూతి మిగిలింది, ఒక మంచి సినిమా మాకు పరిచయం చేసిన బ్లాగరు ప్రసాద్ సామంతపూడి గారికి కృతజ్ఞతలు. "మంచి సినిమాలు చూస్తే మనలో కూడా మంచి భావాలు కలుగుతాయి, మన ప్రవర్తనలో కూడా మార్పు తప్పక వస్తుంది" అని ఆయన అంటారు. మీరు కూడా కొందరు స్నేహితులతో కలిసి మంచి సినిమాలు ఎన్నుకుని కలిసి చూడండి, మీకు మంచి అనుభూతి మిగలకపోతే నన్నడగండి.


గడచిన వారం ఒక కొరియన్ సినిమా చూసాం, ఈ సినిమా అయితే గుండెని పిండేసి, ఉతికి ఆరేసింది. ఆ సినిమా గురించి ఇంకోసారి బ్లాగుతా తియ్యగా....

4 comments:

Sravya V said...

Nice Intro !

శరత్ కాలమ్ said...

ఈ సినిమా గురించి ఇదివరకు ఎప్పుడో ఎక్కడో విన్నాను. అయితే నేను కూడా తప్పకుండా చూస్తాను.

Prasad Samantapudi said...

ఈ సినిమాని ఇప్పటికే చాలా సార్లు చూసినా,మన మిత్రులతో కలిసి చూడడం, చర్చించుకోవడం, కొత్త అనుభూతినిచ్చింది.

శ్రీ said...

@ శ్రావ్య, థాంక్స్

@ శరత్, ఇదివరకు నవతరంగంలో మన ప్రసాద్ గారు రాసారు.

@ ప్రసాద్, మంచి సినిమా మాకు పరిచయం చేసినందుకు థాంక్స్.