ఈ సినిమా చూసిన పక్క రోజు నేను కాబేజీ కూర చేసాను. మసాలా, కనీసం కారం కూడా లేకుండా వంట ముగించాను. కాబేజీలోని సహజ సిద్ధమయిన రుచిని అందరికీ అందించాలని చూసాను, కానీ సమాజం హర్షించలేదు. ఈ సినిమాకీ, నా కూరకి అవినాష్ బావ సంబంధం ఉంది. ఆ సంబంధం గురించి నేను ఇపుడు మాట్లాడబోతున్నాను.
ఎపుడో నేను యూత్ గా ఉన్నపుడు వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాని మళ్ళీ మన ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు వేణు శ్రీరాం. పాత చింతకాయ పచ్చడి. పెద్దగా మసాలా లేకుండా సింపిల్ గా లాక్కొచ్చాడు. సుత్తి కూడా లేకుంటే సినిమా బాగుండేది, కొంచెం సుత్తిగా ఉండేసరికి ఇంకొక తెలుగు సినిమాలా మిగిలిపోయింది.
సిద్ధార్ధ్, శ్రుతీ హాసన్ బాల్య మిత్రులు. చిన్నప్పటి నుండీ చెట్టలు, పట్టలు వేసుకుని తెగ తిరుగుతూ ఉంటారు. ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. ఆడపిల్ల శ్రుతీ బాగనే చదువుకుని అందరికీ తకిట, తథిములు నేర్పిస్తూ ఉంటుంది. సిద్ధార్ధ్ చదువు మీద మనసు పెట్టక వాసు - వాయిస్ ఆఫ్ యూత్ లాగా గిటార్ పట్టుకుంటాడు.
ఎదిగి వచ్చిన కూతురు అంటే గుండె మీద కుంపటి అంటాం, ఎదగలేని కొడుకు అంటే ఎక్కడో కుంపటి అనుకుందాం. ఈ సెగ భరించలేక తనికెళ్ళ భరణి కొడుకుని 'మంట తగ్గించరా బాబూ..' అని తిడుతూ ఉంటాడు. సిద్దూ మంట తగ్గించక పోగా హై ఫ్లేములో వంట చేస్తూ ఉంటాడు. పెద్దయ్యాక కూడా ఇద్దరూ ఇంకా చెట్టలు, పట్టలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకి వీళ్ళిద్దరి జంట చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ స్నేహితులు నవనీత్, హన్సికలతో ప్రేమలో పడతారు. అప్పటివరకూ వేసుకున్న చెట్టలు, పట్టలకి మోక్షం వచ్చి తెగిపోతాయి. జంట పక్షులు వీళ్ళ స్నేహాన్ని అర్ధం చేసుకోలేక అపార్థం చేసుకుంటారు. అపార్థాన్ని అర్ధంగా విడగొట్టలేక సినిమాని అడ్డంగా తెగ్గొట్టడంతో సినిమా ముగుస్తుంది.
చెట్టలు, పట్టలు వేసుకుని తిరుగుతున్న ఈ స్నేహితులని "మీరు లవర్సా" అని ఒక అనామకుడు అడిగితే "మేమా..లవర్సా" అని ఇద్దరూ వంకర తిరుగుతారు. ఈ షాట్ ఇద్దరు మిత్రులులో కూడా ఉంది. అక్కడ చిరుని ఆ రోజుల్లో నేను ఆక్సెప్ట్ చెయ్యలేకపోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక యువ జంట అదే డవిలాగుని చప్పరించడంతో ఇన్ని రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న నేను శాంతించాను.
పూరీని ఎవరో ఒకసారి "మీరు చపాతీ ఎలా చేస్తారూ" అంటే ఇలా సమాధానమిచ్చాడు.
"నా సినిమాల్లో కథ మొదలుపెట్టే ముందు కామెడీ ముందే ఏర్పాటు చేసుకుంటాను. అది బాగా వచ్చాక కథ మొదలుపెడతాను".
సిద్దూతో సినిమాలు తీసేటపుడు కూడా చివరి షాట్ ముందే అనుకుని మిగతా కథ రాసుకుంటారనుకుంటా. సరిగ్గ లెక్కలు రాని వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారని నాకొక ఫ్రెండు చెప్పాడు.
లీడర్ సినిమాలో రాణాకి విషయం లేదు కాబట్టి అతను ప్రతి ఫ్రేములో సిగరెట్టు తగలేస్తూ ఉండేవాడు. సుహాసినీ ఏడుస్తూ చాలా షాట్స్ బాగా కవర్ చేసింది. సాంబారు పాప శ్రుతికి కూడా ఇంచుమించు ఇదే విషయం కాబట్టి ఆమె చేత సిగరెట్టు తాగించలేక సిద్దు (చివరి సీన్) నటిస్తున్నపుడు ఏడుస్తూ ఉంటుంది. కదిలే బొమ్మలు కదలనంతవరకూ ఈ కుందనపు బొమ్మ బాగుంది. కదిలినప్పుడు తేడా కొట్టేసింది. హన్సిక తెలుగు టీవీ సీరియల్ లాగా రెండే పనులు చేసింది. నవ్వడం లేదా ఏడవడం.... నవనీత్ బాగనే చేసాడు. ఇతనొక మంచి వ్యవసాయదారుడు, ఇటువంటి పాత్రలని ఏరుకుంటూ ఉంటాడు.
ఎపుడూ చమటలు పోసే చెన్నై సునామీ వచ్చినపుడు చల్లగా ఉండింది. ఈ సినిమాలో ఆలీ చేట సునామీలా వచ్చి రాయిలా బిగుసుకు పోతున్న మనపై నీళ్ళు చల్లి వెళ్ళిపోతాడు. ఆలీ లేకుంటే మళ్ళీ ఎంటీవోడు "శివశంకరీ" పాట వేసుకోవలసిందేననుకుంటా.
8 comments:
ఈ సినిమా చూసాక మీ కడుపుమంటతో చేసారా కొంపదీసి వంట?
మీ వంట తినే మహత్తర అవకాశం మాకెప్పుడొస్తుందో
అయినా క్యాబేజీ కూరను త్యాగం చెయ్యటానికి మేరేమన్న కేసీయారా?
ఎప్పటి లాగే ప్రేమతో చేసానండీ వంట!
హహహ బాగుందండీ :-) నాకు అసలు సిద్ధార్థ హన్సిక కాంబినేషన్ అంటేనే కళ్ళు బైర్లు కమ్మాయ్... ఆలీ మంచి రిలీఫ్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్ చూసేప్పుడు అచ్చంగా మీరనుకున్నట్లే అనుకున్నా నేను కూడా :-)
nice review
Bhale chepparu mastaru..
వేణు శ్రీకాంత్, సాయి, శ్రీదేవి, అందరికీ థాంక్స్!
sree....))))))))))))keka
థాంక్స్ శశికళ!
Post a Comment