కాలం మారింది, మారుతుంది కూడా. ఒకప్పటి సినిమాలతో పోలిస్తే ఇప్పటి సినిమాలలో హింసకి ఇపుడు వేస్తున్న పీట పెద్దది. పెద్ద పీట వెయ్యడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి కూర్చునే వారి చుట్టు కొలత పెరిగి ఉండచ్చు. రెండు, పాత పీట విరిగి ఉండవచ్చు. కామెడీ పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం. గత కొన్ని సంవత్సరాలు గా మన సినిమాలు చూస్తూ ఉంటే నాకనిపించింది ఏమిటంటే మన సినిమాలలో హింస రోజు, రోజుకీ పెరుగుతుంది. ఒకసారి పాత సినిమాలతో ఇప్పటి సినిమాలు పోల్చి చూడండి. మీకే తెలుస్తుంది.
జానపద సినిమాల్లో హీరో, విలన్ కత్తి యుద్ధాలు, లేకపోతే కుస్తీలతో సరిపెట్టుకునే వాళ్ళు. ఇక పౌరాణికాలయితే నాయకుడు, ప్రతి నాయకుడు పెద్ద, పెద్ద పద్యాలు చదువుతూ అపుడపుడూ బాణాలు వదులుకునేవాళ్ళు. ఈ బాణాలు కూడా గాలిలో పాము, ముంగిస లేకపోతే మంట, నీళ్ళు లాగా కాసేపు తమాషా చూపించి సినిమా పూర్తి చేసేసేవాళ్ళు.
ఇక తరువాత వచ్చిన సాంఘిక సినిమాలలో రామారావ్ కొంచెం మొరటుగా నాగేశ్వర రావు, కృష్ణ చాలా సున్నితంగా ఫైట్ చేసేవాళ్ళు. రామారావు అయినా మూడు దెబ్బలు తినేవాడేమో కానీ, సూపర్ స్టార్ అయితే మొదటి దెబ్బ నుండి విలన్లని సున్నితంగా చావగొట్టేవాడు. ప్రజలు కూడా ఈ సున్నిత, సాహసోపేత పోరాటాలు చూసి పిచ్చెక్కిపోయేవాళ్ళు.
ముసలి తరాని వెనక్కి నెట్టి పైకి వచ్చిన వాడు చిరంజీవి, ఇక ఇతని రోజుల్లో పోరాటాల సిలబస్ మారింది. మన ఇంటి పోరాటాలు కాకుండా కరాటే లాంటి పక్కింటి సిలబస్సుని మన ముందుకు తెచ్చారు. ఆషామాషీగా కాకుండా కొంచెం గట్టిగానే మనుషుల్ని కొట్టడం ప్రారంభించారు. కాకపోతే ఇతను మొదటి మూడు దెబ్బలు తినేవారని మీకందరకీ తెలిసిందే! అతనితో పాటు సుమన్, భాను చందర్ కూడా తమ వంతు కరాటేని మన సినిమాల్లోకి చొప్పించారు.
చిరంజీవి తరం తర్వాత భారతీయ సంప్రదాయం ప్రకారం వెంకటేష్, నాగార్జున తెర మీదకి వచ్చారు. వీళ్ళు కొంచెం నిలదొక్కుకున్నాక, నేల తొక్కే సమయంలో రాము కొత్త స్కూలు తెరిచాడు. ఇతని సిలబస్ కొంచెం కొత్తగా ఉండేది, శివ సినిమా నుండి నాగార్జునకి కొత్త రకం ఫైటింగ్స్ అంటగట్టాడు. పిడికిలి బిగించి పొట్టలో ఒరే (తమిళములో చదువుకోండి, కిక్కు కోసం) పోటు! విలన్ మనకి రక్తం చూపించకుండా అతనే గిల, గిలా కొట్టుకుని కింద పడిపోతాడు. రాము సినిమాల్లో హింస ఎలా ఉంటుందంటే రాజ్ కపూర్ సినిమాలలో శృంగారం లాగ.
ఇక చివరాకరి తరం అంటే నేటితరం, మళ్ళీ అంటే యువతరం ఫైట్లకి నాంది అతడు సినిమా నుండి మొదలయింది. లేత మునక్కాయ లాగా ఉండే మహేష్ బాబు చేత త్రివిక్రం కొత్త రకం ఫైట్స్ చేపించాడు. బాబు వాళ్ళ నాన్న లాగే సున్నితంగా గట్టి పిడి గుద్దులు గుద్దితే రాము సినిమాలోలా విలన్లు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో గిల, గిలా కొట్టుకోవడం ప్రారంభించారు. కాకపోతే ఈ కింద పడినవాడు పత్తి పంటలో పురుగులాగా మళ్ళీ,మళ్ళీ లేచి దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక అప్పటి నుండి బాబు నుండి అల్లరి నరేష్ వరకు ఇలాంటి ట్రెండునే ఫాలో అవుతున్నారు.
మొన్న ఊ కొడతారా..ఉలిక్కి పడుతారా సినిమా చూసి గగుర్పాటు కలిగింది. మంచు మనోజ్ పేరులోనే కూలింగ్ ఉంది, సినిమాలో మాత్రం అతని పాత్ర ప్రవర్తన చాలా పైశాచికంగా అనిపించింది. పాత్ర మరీ ఇంతలా డిమాండ్ చేసిందా? ఏదయితేనేం, పర్యావరణంలో కాలుష్యం ఎక్కువ అయినట్టు సినిమాలల్లో హింస బాగానే ఎక్కువ అయింది. ప్రేక్షకులకి హింస ఒక వ్యసనం అయిపోయిందా అనిపిస్తుంది అపుడపుడూ! తెర మీద అంత హింస చూస్తే కానీ వీళ్ళ శరీరాళ్ళో రక్త ప్రసరణ జరగడంలేదేమో? మంతెన గారు చెప్పినట్టు చింతపండు ఎక్కువ తింటే రక్త ప్రసరణ తగ్గుతుందట. అటువంటి వాళ్ళు మన సినిమాలు చూస్తే రక్తం ఎల్లో స్టోన్స్ పార్కులో ఓల్డ్స్ ఫెయిత్ ఫుల్ గైజర్ చిమ్మినట్టు ఉవ్వెత్తున పాకుతుందేమో? ఏమిటో, నా రాతలో కూడా కొంచెం హింస పెరిగినట్టుంది!
11 comments:
Super :-)
హింస గురించి ఇంత హింసించాలా? :)
మీ పరిశీలనా బాగుంది.
ఈ సారి డ్రెస్ సెన్స్ గురించి వ్రాయండి.
థాంక్స్ శ్రీరాం!
థాంక్స్ వనజవనమాలి! డ్రెస్ సెన్స్ గురించి నాకు పెద్దగ ఐడియా లేదు. కమెడియన్స్ గురించి రాద్దామనుకుంటున్నా...
Very scientific analysis. :)
కానీ తెలుగు సినిమాల్లో హింసని గురించిన విశ్లేషణలో, రాజమౌళి, జూనియర్, సింహద్రి సినిమాల ప్రస్తావన లేకపోవడాన్ని ఖండిస్తున్నా మధ్యక్షా.
Aa chiraku padathara chepputho kodathara cinema ki review edhi raja?
ఆ సినిమానే ఈ టపాకు స్పూర్తి.ఎందుకో, ఆ సినిమాకి వ్రాయాలనిపించలేదు!
మీరు చెప్పింది కరెక్టే! ఫాక్షనిజం మీద ఒక టపా బ్లాగేస్తా.
మంచి అనాలిసిస్.. కానీ నారాయణస్వామిగారు చెప్పినట్లు కొందరిని పూర్తిగా వదిలేశారు. అసలు ఈరేంజ్ నరుకుళ్ళు మొదలెట్టిన బాలయ్యబాబు బి.గోపాల్ ల రిఫరెన్స్ కూడా ఉంటే పరిపూర్ణంగా ఉండేది.
ఈమధ్య సెన్సార్ కత్తెరకు పదునెక్కువైంది అనుకున్నా కానీ ఈ సినిమాలో మళ్ళీ బొత్తిగా రిలాక్స్ చేసేశారు. మొదటి అరగంట పాటు డార్క్ కామెడీ పేరుతో చూపించిన హింసకి చిరాకొచ్చింది.
నిజమేనండి. ఫాక్షనిజం మీద ఒక టపా రాస్తాను. నాకు కూడా మొదట అరగంట చూసి చాలా జుగుప్స కలిగింది.
అవునండి.సినిమాకి వెళ్ళాలి అంటేనే విసుగు వస్తుంది.
రక్తాలు చూసి..చూసి...బాగా వ్రాసారు
Post a Comment