Friday, December 25, 2015

కొలరాడో యాత్ర విశేషాలు - 6

కొలరాడో యాత్ర విశేషాలు మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాల్గవ భాగం, ఐదవ భాగం
మీరు చదవకపోతే ఇక్కడ 123 , 4, 5 మొదలుపెట్టచ్చు.



ఐదవ రోజు, బుధవారం జూలై 1, ఆరే


మా ప్రయాణంలో ఇదే కీలకమైన రోజు, ఎందుకంటే మిలియన్ డాలర్ హైవే చాలా ప్రముఖమైనది. చాలా మంది బైకర్లకి అక్కడ బండి నడపాలని ఎంతో కోరిక ఉంటుంది. ఆ ప్రయాణం వారి జీవితంలో ఒక మరచిపోలేని రోజుగా గుర్తు ఉంచుకుంటారు. యూట్యూబులో మిలియన్ డాలర్ హైవే మీద చాలా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలో, ఫోటోలు చూసాక మాకందరికీ ఉత్సాహం మరింత రెట్టింపయ్యేది.


ఎప్పటిలాగే ఆరోజు కూడా స్నాన,పానాలు మిగించి అల్పాహారం కోసం బయలుదేరాము. ఈరోజు వినయ్, రూపి, దేవేందర్, కృష్ణ మరియు నేను మాత్రమే ఈ ప్రయాణం చేస్తున్నాము. కేకే కుటుంబంతో కలిసి ఆఫ్ రోడ్ అడ్వెంచర్ చేద్దామని సిద్ధం అవుతూ ఉన్నారు. ఫరూఖ్ తన బంధువుని కలవాలని కొంచెం లేటుగా బయలుదేరి ఆరోజు సాయంత్రం ఇతను ఒక్కడే ఇంకో చోట బస చేయబోతున్నాడు. కాకపోతే మాతోపాటూ అల్పాహారానికి బయలుదేరాడు. తరువాత బట్టలు ఉతుక్కుని నిదానంగా బయలుదేరుదామని అతని ఉద్దేశ్యం. 


ముందుగా అనుకున్న ప్రకారం ఆరోజు విరామం రోజు అన్నమాట. అందుకే మేము కూడా ఆరోజు కొన్ని గంటలు మాత్రమే బండి నడుపుదామని నిర్ణయించాము. అల్పాహారానికి వెళ్ళేముందు ఒక సారి అందరి బైకు టైర్లలో గాలి చెక్ చేసుకున్నాము. ఇక్కడే నేను ఇంకో తప్పు చేసాను. టైరులో గాలి అన్నది చాలా కీలకం, ఎక్కువైనా మరి తక్కువైనా బండి నడకలో తేడా తెలిసిపోతుంది. అసలే వెళ్ళేది బీభత్సమైన ఘాట్ రోడ్! అందరి దగ్గరా టైరు లో గాలి కొలిచే పరికరం ఉంది. దానితో చూసుకుని గాలి తగ్గితే కొట్టడం జరిగింది. నా పరికర వాడకం సరిగ్గ తెలియక నా టైరులో గాలి కొట్టి మళ్ళీ కొంత తీసేసాను. దానితో అప్పటి వరకు సుఖమయమైన నా ప్రయాణంలో ఆనందభైరవి రాగం శ్రుతి తప్పింది. అది నాకు కొండ ఎక్కాక తెలిసింది. అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. మరీ ఎక్కువకాదు కానీ హాండిల్ మీద నేను కొంత బలం పెట్టవలసి వచ్చింది.

"అప్పుడు తెలిసింది, కథ ముగిసే పోయింది! ఓ బాటసారి ఇది జీవిత రహదారి!" పాట దారి పొడుగునా నా చెవిలో మోగుతూనే ఉంది.

ఆరే రెండు కొండల మధ్యలో ఉంటుందని చెప్పాను కదా! ఆ కొండలు దాటి ఊరు చివరలో నుండి ఒక పెద్ద మలుపు తిరిగి మిలియన్ డాలర్ హైవే ఎక్కుతాము. కొండ ఎక్కినప్పటి నుండి అద్భుతమైన ఆ ప్రకృతి మనల్ని మైమరపిస్తుంది. మొదటి పది మైళ్ళు రోడ్ అంచులో భయంకరమైన లోయలు. ఆ లోయలో అందమైన సెలయేళ్ళు. ఒక వైపు వెళ్ళడానికి, ఇంకో వైపు రావడానికి ఒక్కొక్క లైను మాత్రమే! ఒక వైపు ఆ ప్రకృతిని చూసి మైమరుస్తూ మరొక వైపు ఆ రోడ్ మీద చాలా జాగ్రత్తగా నడపాలన్న ఆందోళనల మధ్య మా ప్రయాణ సాగింది. పక్కన ఆగి ఫోటోలు తీసుకునే ప్రదేశాలు కూడా తక్కువ. ఒక అయిదు మైళ్ళ దూరంలోనే ఒక భారీ జలపాతం దగ్గర ఆగాము. కొండలపైన నుండి వస్తున్న ఆ జలపాతం చాలా అందంగా ఉంది. రోడ్ పైనుంది కిందకి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. నాకు తేరుకోవాడానికి కొంత సమయం పట్టింది. కొన్ని ఫోటోలు దిగి అటుగా వచ్చిన వారితో అందరం ఒక ఫోటో తీసుకుని మళ్ళీ కదిలాము. 






అక్కడ నుండి ప్రయాణం సాఫీగా సాగింది. రోడ్ పక్కన కొంచెం స్థలం కూడా ఉండి అవసరమైనపుడు ఆగడానికి అనువుగా కూడా ఉండింది. కాకపోతే మలుపులు బాగా ఉండి నిదానంగా వెళ్తూ ఉన్నాము. ఈ పర్వతాలని అక్కడ నుండి అరగంటలో డ్యూరాంగో చేరుకున్నాము. 

















భోజనాల వేళ అయ్యేసరికి ఒక మెక్సికన్ రెస్టారెంటులో ఎంగిలి పడ్డాము. భోజనాలయ్యాక ఇంకో కొత్త కథ మొదలయింది. అందరూ బైకు స్టాండ్ నుండి బయలుదేరుతూ ఉంటే రూపి బైకు నుండి పెట్రోల్ కారుతూ కనిపించింది. అంతకుముందే టాంక్ నింపాము, అది నిండిపోయి ఇలా బయటకు వస్తుందేమో అనుకున్నాము. కానీ అది ఎంతసేపటికీ ఆగలేదు. కాసేపు ఒక రౌండ్ వేసిరమ్మని పంపాము. తిరిగి వచ్చినా పెట్రోల్ కారడం ఆగలేదు. మా అదృష్టం బాగుండి పక్కనే ఒక మోటర్ సైకిల్ షాపు కనిపించింది. అందరం అక్కడకి వెళ్ళి మెకానిక్ ని కలిసాము. 

అతను ఒక గంటలో రిపేరు చేసి "మీరు ఇందాక కొండలపై ఎత్తులో బండి నడిపారు కదా.. ఇంజిన్ గాలి, పెట్రోల్ మిశ్రమం కలిపేటపుడు తికమక్ పడింది. ఇపుడు కిందకి దిగారు, దానికి ఇంకా అర్థం కాలేదు" అని వివరించాడు. 

రూపి బైకు కార్బొరేటరు వాడుతుంది, మిగతా మా బైకులన్నీ ఇంధనం అవసరమైనంత వాడే ఇంజిన్లు. అందుకే మాకు ఈ ఇబ్బంది రాలేదు. బహుశా ఫారుక్ బైకుకి కూడా ఇదే ఇబ్బంది ఏమో అని అనుకున్నాము.శాన్ యువాన్ పర్వతాలు అంటారు. అన్నిటికంటే పైన ఒక పెద్ద కొండ మనకి చాలా దూరాం నుండి కనిపిస్తూ ఉంటుంది. జూన్ నెల చివర, వేసవి కాలంలో కూడా ఆ కొండ మీద పై భాగంలో కరగని మంచు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముందు వినయ్, రూపి, కృష్ణ, దేవేందర్ చివరగా నేను వెళ్తూ ఉన్నాం. ఈ జంటలు బ్లూ టూతులో మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ. ఒక చోట కుడివైపు మలుపు మొదలయింది, ఇది పది మైళ్ళ స్పీడులో తిప్పే మలుపు. ప్రతి మలుపు మొదలయే ముందు కనపడే స్పీడ్ నోటిస్ బోర్డుని మేము జాగ్రత్తగా గమనిస్తూ ఆ స్పీడులో మలుపులు తిప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. 


స్పీడుతో పాటూ బండి నడిచే గేరు కూడా చాలా కీలకం. టాపు గేరు కంటే చిన్న గేరులోనే బండిని బాగా అదుపులో నడపచ్చు. ప్రత్యేకంగా కొండలు ఎక్కేటపుడు రెండో గేరు బాగా వాడుతారు. టాపు గేరులో చిన్నగా కొండ ఎక్కేటపుడు బండి నిలిచిపోయే అవకాశం ఉంది. ఆరోజు అదే జరిగింది. కృష్ణ నాలుగో గేరులో కుడివైపు తిరుగుతూ స్పీడు తగ్గించడం వల్ల ఇంజిన్ ఆగిపోయింది. కుడి వైపు మలుపులో ఆగిపోవడం వల్ల వేరే వైపు బండి ఒరిగింది. అటువైపు ఎక్కువ ఎత్తులో ఉండడం వలన బండిని నిలపలేక కృష్ణ నిదానంగా కుడివైపు పడిపోయింది. బండి ఆమె మీద పడిపోయింది. వెనకనే వస్తున్న దేవేందర్ తన బండిని రోడ్ మీద ఆపి ఆమెని కాపాడడానికి పరుగెత్తాడు. వెనక వస్తున్న నేను కూడా ఆ మలుపులో ఆగిపోయాను. నా బండిని ఆపి నేను దిగాలంటే కష్టం. బ్రేకు మీద కాలు తీస్తే బండి వెనక్కి జారుతుంది. నా వెనక, ముందు ఉన్న కార్లు కూడా ఆగి కొంతమంది కిందకు దిగారు. దేవేందర్ తొందరగానే బండిని లేపి కృష్ణని కూడా పక్కన కూర్చోపెట్టాడు. కృష్ణ బూట్స్ మీద బండి ఒరిగింది. అది బాగా గట్టి బూట్స్ కావడం వల్ల ఆమెకి పెద్ద ప్రమాదం తప్పింది, లేదంటే మడమ ఎముక విరిగే అవకాశం లేకపోలేదు! కృష్ణకి ఏమీ కాలేదని మీరు వెళ్ళండనీ దేవేందర్ నాకు చెప్పాడు, నేను అక్కడ ఆగకుండా ముందుకు కదిలాను. ఆ సమయంలో ఆ జంటని అక్కడే కాసేపు వదిలితే వాళ్ళు తొందరగా దాని నుండి తేరుకోగలరు.ముందు వెళ్ళిపోయిన వినయ్, రూపికి ఈ విషయం తెలియదు.   


నేను ముందుకు కదిలి రెండు మలుపులు తిరిగేసరికి వినయ్, రూపి మాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. నేను ఆగి వాళ్ళకి విషయం చెప్పేసరికి ఇద్దరూ కంగారు పడ్డారు. కాకపోతే ఏమీ కాలేదు అనేసరికి వారికి ఊరట కలిగింది. ఈలోపల దేవేందర్, కృష్ణ మమ్మల్ని దాటుకుని ముందుకు కదిలారు. వినయ్, రూపి, నేను కలిసి బయలుదేరి మధ్యలో కొన్ని చోట్ల ఆగుతూ ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నాము. మా ముందే ఒక కారు రోడ్ పక్కన కొంచెం లెఒపలకి వెళ్ళి తిరిగివస్తుంది. మేము కూడా అక్కడ ఆగి ఏముందో అని చూడడానికి వెళ్ళాము. కొంచెం లోపలకి వెళ్ళి మాకు నీళ్ళు పారే శబ్దం వినిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న వాగు, దానికి కొంచెం దూరంలోనే మంచు కూడా ఉంది. అంటే ఆ మంచు కరిగి అక్కడే నీళ్ళుగా మారుతూ ఉందనమాట. అక్కడ నుండి కాసేపట్లోనే సిల్వర్టన్ చేరుకున్నాము. దానితో మిలియన్ డాలర్ హైవే ప్రయాణం ముగిసింది. ఇరవైఏడు మైళ్ళు దాటడానికి మాకు ఇంచుమంచు రెండు గంటలు పడింది. సిల్వర్టనులో బంగారు గని ఉంది. అక్కడ కాసేపు ఆగి వాగులో కాసేపు గడిపాము.


అక్కడ నుండి అరగంటలో డ్యూరాంగో చేరుకున్నాము. భోజనాల వేళ అయ్యేసరికి ఒక మెక్సికన్ రెస్టారెంటులో ఎంగిలి పడ్డాము. భోజనాలయ్యాక ఇంకో కొత్త కథ మొదలయింది. అందరూ బైకు స్టాండ్ నుండి బయలుదేరుతూ ఉంటే రూపి బైకు నుండి పెట్రోల్ కారుతూ కనిపించింది. అంతకుముందే టాంక్ నింపాము, అది నిండిపోయి ఇలా బయటకు వస్తుందేమో అనుకున్నాము. కానీ అది ఎంతసేపటికీ ఆగలేదు. కాసేపు ఒక రౌండ్ వేసిరమ్మని పంపాము. తిరిగి వచ్చినా పెట్రోల్ కారడం ఆగలేదు. మా అదృష్టం బాగుండి పక్కనే ఒక మోటర్ సైకిల్ షాపు కనిపించింది. అందరం అక్కడకి వెళ్ళి మెకానిక్ ని కలిసాము. అతను ఒక గంటలో రిపేరు చేసి "మీరు ఇందాక కొండలపై ఎత్తులో బండి నడిపారు కదా.. ఇంజిన్ గాలి, పెట్రోల్ మిశ్రమం కలిపేటపుడు తికమక్ పడింది. ఇపుడు కిందకి దిగారు, దానికి ఇంకా అర్థం కాలేదు" అని వివరించాడు. రూపి బైకు కార్బొరేటరు వాడుతుంది, మిగతా మా బైకులన్నీ ఇంధనం అవసరమైనంత వాడే ఇంజిన్లు. అందుకే మాకు ఈ ఇబ్బంది రాలేదు. బహుశా ఫారుక్ బైకుకి కూడా ఇదే ఇబ్బంది ఏమో అని అనుకున్నాము.


బైకు రిపేరు తర్వాత మీసా వెర్డే అన్న ప్రదేశానికి బయలుదేరాము. అక్కడ నివసించిన అమెరికన్ ఇండియన్ల గురించి సమాచారం అందించే ఒక మ్యూజియం ఉంది. చదరంగా ఉండి ఒక టేబిల్ లాగా అనిపించే ఈ కొండని లాటిన్ భాషలో మీసా వెర్డే అంటారు. మీసా అంటే టబిల్, వర్డే అంటే కొండ. ఆ కొండ మీద ఇండియన్లు వ్యవసాయం చేసేవారట. మేము అక్కడకి చేరేసరికి బాగా ఎండ. లోపలకి వెళ్ళి ఇండియన్ల వ్యవాసయ పద్ధతుల గురించి తెలుసుకున్నాము.అక్కడ నుండి ఆరేకి తిరుగుప్రయాణం మొదలుపెట్టాము. 











వచ్చిన దారే కాకుండా వేరే మార్గంలో బయలుదేరాము. ఈసారి దారిలో ఎక్కడా ఆగకుండా రెండు గంటలు వెళ్ళాము. ఈసారి వినయ్ జంట ఆగిన చోట దేవేందర్ జంట ఆగలేదు. ఇదే నా కొంప ముంచింది. కృష్న విరామం కోసం ఆగితే వినయ్, రూపి ఆగలేదు. నేను ఆగినా విరామం ఎందుకులే అని కాసేపు అలోచించి మళ్ళీ బయలుదేరా. వినయ్ వాళ్ళు అప్పటికే కొంత దూరం వెళ్ళారు. ఈలోపల రోడ్ రెండుగా చీలింది. నిన్న వచ్చిన మోంట్ రోస్ పేరు కనిపించి నేను కుడిపక్కకు తిప్పాను. ఎంత దూరం వెళ్తున్నా వినయ్ కనపడడం లేదు. దారిలో ఆగడం ఎందుకని వెళ్తూనే ఉన్నారేమో? అనుకుని నేను కూడా వెళ్తూనే ఉన్నాను. కొంపదీసి దారి తప్పనేమో అని నాకు అనుమానం మొదలయింది. ఒకచోట ఆగి ఫోన్ చేద్దామనుకుని ఫోన్ చేస్తూ ఉంటే దేవేందర్ జంట కనిపించారు. హమ్మయ్యా అనుకుని మళ్ళీ వాళ్ళ వెనక బయలుదేరాను. నాకోసం దగ్గరలోని పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు. ఈలోపల వినయ్ కూడా ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగాడు. వాళ్ళు అప్పటికే ఆరే చేరుకుని మా కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణ అక్కడ బట్టల సోపు కొనుక్కున్న అర్వాత అందరం ఆరే చేరుకున్నాము. 




మాసిపోయిన బట్టలు ఉతికేసుకుని ఊరిలోకి వెళ్ళి సుష్టుగా భోజనం చేసాము. మేము తిరిగి వచ్చేసాక కేకే కుటుంబము కూడా కాబిన్ చేరుకున్నారు. అందరం కాసేపు వెన్నెలలో కాబిన్ వెనక కుర్చీలేసుకుని సేలయేరుని చూస్తూ కబుర్లు చెప్పుకున్నాము. ఈలోపల జాబిల్లికి నిద్ర వచ్చి మబ్బుల దుప్పటి పైకి లాక్కున్నాడు.  

2 comments:

Unknown said...

Nee vyasam chala bagundi. Goppaga narrate chesavu. Chaduvuthunte naku kuda ala sahasa journey chaeyalani vuntundi. Kani ikkada naku mee friends la like minded manashulu leru. Enthasepu thunnama padukunnama ante. ENJOY THE TRIP

శ్రీ said...

Thanks Balu anna. Plan some trip soon!